
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా తొలుత న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించి.. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించి ఆమె.. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించారు. రేఖా గుప్తా హర్యానాలోని జులానాలో 1974 జులై 19న బనియాల కుటుంబంలో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కాలేజీలో బీకాం చదివారు.
1992లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఏబీవీపీ తరఫున 1996–-97 సంవత్సరానికి ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మీరట్‌లోని చౌదరి చరణ్‌సింగ్ యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. కొంతకాలం లాయర్‌గా పనిచేశారు.
1998లో స్పేర్ పార్ట్స్ఇండస్ట్రీ బిజినెస్మెన్ అయిన మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. 2007లో రేఖా గుప్తా ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలుపొందారు. మళ్లీ 2012లోనూ విజయం సాధించారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ఆమె చురుగ్గా పనిచేశారు. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించారు.
ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్ తర్వాత సీఎం పగ్గాలు చేపట్టనున్న 5వ, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టిన 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు. అలాగే, ఢిల్లీకి బీజేపీ ఏకైక మహిళా సీఎం మాత్రమే కాదు.. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశి తర్వాత నాలుగో మహిళా సీఎం రేఖా గుప్తానే.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగానే..
రేఖాగుప్తా.. 2015, 2020 ఎన్నికల్లో షాలీమార్ బాగ్‌లో బీజేపీ నుంచి పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచారు. స్టూడెంట్ లీడర్‌గా.. కౌన్సిలర్‌గా, మేయర్‌గా ఆమె చేసిన ప్రజాసేవ, విద్యార్థి నాయకురాలి నుంచి మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పార్టీ కోసం పడ్డ కష్టాన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆమెకు సీఎం పగ్గాలు అప్పజెప్పింది.
సోషల్ మీడియాలో పాత పోస్టులు వైరల్
ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా పేరును బీజేపీ ప్రకటించగానే.. ఆమె సోషల్ మీడియాలో గతంలో పోస్ట్‌చేసి, వెంటనే డిలీట్ చేసిన అసభ్యకర పోస్టులను విమర్శకులు, ప్రతిపక్షాలు వైరల్ చేస్తున్నాయి. ఆమె పలుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు, చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారని కేజ్రీవాల్ మద్దతుదారులు విరుచుకుపడ్డారు.
కేజ్రీవాల్ పుట్టుకతో సహా అనే అంశాలపై మీమ్స్ పోస్ట్ చేశారని మండిపడ్డారు. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్లాంటి గొప్ప మహిళా నాయకులకు భిన్నంగా రేఖాగుప్తా ప్రవర్తన ఉన్నదంటూ తృణమూల్ కాంగ్రెస్ఎంపీ సాగరిక ఘోష్ పోస్ట్ పెట్టగా.. ఆప్ అవినీతి మంత్రులను ఎదుర్కోవాలంటే ఆ మాత్రం భాష వాడక తప్పదని బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. గతంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల కంటే రేఖా గుప్తా పోస్ట్ చేసిన మీమ్స్, కామెంట్స్ బాగానే ఉన్నాయని చురకలంటించారు.