
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సీఎం అభ్యర్థి ఎంపికపై కాషాయ పార్టీ దృష్టి సారించింది. ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు బీజేపీ అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ఆదివారం (ఫిబ్రవరి 9) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర అగ్రనేతలు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఢిల్లీ సీఎం పేరును ఖరారు చేయనున్నట్లు టాక్.
అయితే.. ఢిల్లీ సీఎం క్యాండిడేట్ పేరు ఖరారు చేసినప్పటికీ.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమం మాత్రం ఫిబ్రవరి 13 తర్వాత ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ప్రధాని మోడీ అమెరికా పర్యటన. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు ప్రధాని మోడీ ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
దీంతో ప్రధాని మోడీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 26 ఏళ్ల సుధీర్ఘ కాలం తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఢిల్లీలో బీజేపీ గెలుపుకు ప్రధాని మోడీనే ప్రధాన కారణమని కమలం పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మోడీ సమక్షంలోనే జరగాలని.. అందుకే పీఎం విదేశీ టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించున్నట్లు తెలిసింది.
ఢిల్లీలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో సీఎం ఆశవాహులు భారీగా పెరిగిపోయారు. దాదాపు ఆరుగురు బీజేపీ కీలక నేతలు ఢిల్లీ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. వీరిలో కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ.. సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. మరీ ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలను బీజేపీ అధిష్టానం ఎవరికి అప్పగిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.