ఢిల్లీలో 60% పోలింగ్.. అత్యధికంగా ముస్తఫాబాద్​ 66.68 %....అత్యల్పంగా కరోల్ బాగ్ లో 47.40 %

ఢిల్లీలో 60% పోలింగ్.. అత్యధికంగా ముస్తఫాబాద్​ 66.68 %....అత్యల్పంగా కరోల్ బాగ్ లో 47.40 %
  • ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
  •  ఓటేసిన రాష్ట్రపతి, రాహుల్, కేజ్రీవాల్ 

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 70 సీట్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 57.70 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 66.68 శాతం, అత్యల్పంగా కరోల్ బాగ్ లో 47.40 శాతం పోలింగ్ రికార్డయింది. 

ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. రాష్ట్రపతి భవన్ ఎస్టేట్ లోని పోలింగ్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్ లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటు వేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్ చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు.

 కేంద్రమంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం ఆతిశి, ఆప్ సీనియర్ లీడర్ మనీశ్ సిసోడియా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఢిల్లీలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 62.59 శాతం, 2024 లోక్ సభ ఎన్నికల్లో 56 శాతం పోలింగ్ నమోదైంది.

పైసలతో పట్టుబడ్డ సీఎంవో సిబ్బంది.. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు సీఎం ఆతిశి ఆఫీస్ సిబ్బంది ఇద్దరు రూ.5 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డారు. ‘‘కారులో ఇద్దరు డబ్బులు తీసుకెళ్తున్నారని సమాచారం అందింది. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ స్పాట్ కు వెళ్లి పరిశీలించి, ఆ ఇద్దరినీ పట్టుకుంది. కారులో ఉన్న రూ.5 లక్షలు స్వాధీనం చేసుకుంది. 

మేం అక్కడికి వెళ్లి వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నాం. వాళ్లను సీఎం పీఏ పంకజ్ అసిస్టెంట్ గౌరవ్, డ్రైవర్ అజిత్ సింగ్ గా గుర్తించాం. కాల్ కాజీ అసెంబ్లీ సెగ్మెంట్ లోని గిరినగర్ లో పోల్ మేనేజ్ మెంట్ కోసం ఆ డబ్బులను సీఎం పీఏ పంకజ్ ఇచ్చాడని గౌరవ్ తెలిపాడు. దీనిపై విచారణ జరుపుతున్నాం” అని డీసీపీ రవికుమార్ సింగ్ తెలిపారు.