ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ హామీలు

  • మహిళలకు నెలనెలా 2,500
  • గర్భిణిలకు రూ.21 వేలు, 6 న్యూట్రీషన్ కిట్లు
  • రూ.500లకే గ్యాస్ సిలిండర్
  • మేనిఫెస్టో ఫస్ట్​ పార్ట్  విడుదల చేసిన నడ్డా

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కోసం బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఫస్ట్ పార్ట్​లో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే  పథకాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థికసాయం, గర్భిణిలకు రూ.21 వేలతోపాటు ఆరు న్యూట్రిషన్​ కిట్లు, 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్లు లాంటి స్కీమ్స్​తో వారిని ఆకట్టుకునేలా రూపొందించింది. 

శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సంకల్ప పత్ర(మేనిఫెస్టో) మొదటి పార్ట్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి చెందిన ఢిల్లీ కోసం’’ మహిళల సాధికారత, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. 

అలాగే ఆమ్​ఆద్మీ పార్టీ(ఆప్)​ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయిస్తామన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఫస్ట్​ కేబినెట్ మీటింగ్​లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ఆయూష్మాన్​ భారత్’ స్కీం ను అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా రూ.5లక్షల హెల్త్ కవరేజ్ ఇస్తామని.. మొత్తంగా ప్రతి వ్యక్తికి రూ.10 లక్షల హెల్త్ కవరేజీ అందిస్తామని తెలిపారు. 60-–70 ఏండ్ల మధ్య వయస్సు గల సీనియర్ సిటిజన్లకు రూ.2,500.. 70 ఏండ్లు దాటిన వారికి రూ.3,000 పెన్షన్‌‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే వితంతువులు, దివ్యాంగులకు రూ.3 వేల పెన్షన్ అందజేస్తామని చెప్పారు.

మోదీపై కేజ్రీవాల్​ విమర్శలు

బీజేపీ మేనిఫెస్టో పై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఆప్‌‌ ఇచ్చిన హామీలను బీజేపీ ‘కాపీ’ కొట్టిందని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ అనేక ఉచితాల ను ప్రకటించిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్టీ ఇచ్చిన ఈ ఉచితాలను ఆమోదించరని అన్నారు. ఒకవేళ మోదీ వీటికి ఆమోదం తెలిపితే ఇన్నాళ్లు ఉచిత పథకాలు అమలు చేసినందుకు తనపై చేసిన విమర్శలను తప్పు అని ఒప్పుకోవాలని డిమాండ్​చేశారు.