కాలుష్య సమస్యకు అదే పరిష్కారం..కృత్రిమ వర్షానికి అనుమతివ్వండి..కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

కాలుష్య సమస్యకు అదే పరిష్కారం..కృత్రిమ వర్షానికి అనుమతివ్వండి..కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ
  • ఢిల్లీలో కృత్రిమ వర్షం..
  • కాలుష్య సమస్యకు అదే పరిష్కారం: ఢిల్లీ మంత్రి గోపాల్​ రాయ్​
  • అనుమతి కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్​
  • మూడు లేఖలు రాశాం..ఇప్పటికైనా పర్మిషన్​ ఇవ్వాలని వినతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్య సమస్యకు కృత్రిమ వర్షమే పరిష్కారమని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్​రాయ్​ అన్నారు. వెంటనే కృత్రిమ వర్షం కురిపించేలా క్లౌడ్​ సీడింగ్​కు అనుమతించాలని ఆయన కేందాన్ని కోరారు. 

ఈ అంశంపై కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్​ యాదవ్​కు తాను మూడు నెలలనుంచి  లేఖలు రాస్తున్నాని చెప్పారు. అయినా.. కేంద్రంనుంచి స్పందన లేదని అన్నారు. ఢిల్లీలో హెల్త్​ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా.. ప్రజలకు సంబంధించిన  ఓ ప్రధాన సమస్యపై లేఖలు రాస్తున్నా పట్టించుకోరా? అని కేంద్రంపై ఫైర్​ అయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నార్త్​ ఇండియాను పొగమంచు కప్పేస్తున్నది. 

ఢిల్లీపై దట్టంగా కమ్ముకున్న పొగమంచు పొరను బద్ధలు కొట్టాలంటే కృత్రిమ వర్షం కురిపించాల్సిందే. క్లౌడ్​ సీడింగ్​ చేస్తేనే కాలుష్యం తగ్గి, ఢిల్లీ ప్రజలకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.  ఇందుకోసం నేను ఆగస్టు 30, అక్టోబర్​ 10, అక్టోబర్​ 23న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రికి లేఖలు రాశా.  కానీ, వారు పట్టించుకోవడం లేదు.  దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటుచేయాలి. 

చర్యలు తీసుకోలేకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని రాయ్‌‌ పేర్కొన్నారు. ఈ సమస్యపై వేరే దేశ మంత్రికి తాను లేఖ రాసినా.. మన కేంద్ర సర్కారుకంటే వేగంగా స్పందించేవారని సెటైర్​ వేశారు.

కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని తగ్గించొచ్చా?

కృత్రిమ వర్షంతో కాలుష్యం తగ్గే చాన్స్​ ఉన్నదని సైంటిస్టులు చెబుతున్నారు. వర్షం చినుకులు రాలుతున్నప్పుడు.. వాటితోపాటే ధూళి రేణువులు నేలను చేరుతాయి. దీంతో వాతావరణంలో కాలుష్యం తగ్గుతుంది. అయితే, ఈ ప్రభావం ఎక్కువ రోజులు ఉండదని సైంటిస్టులు అంటున్నారు. 

కాగా, కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఉత్తర ప్రదేశ్​లోని ఎన్సీఆర్​ జిల్లాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. పశ్చిమ యూపీలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఆన్​లైన్​లో తరగతులు నిర్వహించాలని ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.

కాలుష్యం ఎఫెక్ట్​.. వర్చువల్​గా కోర్టు విచారణలు

ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్​తో కోర్టులు వర్చువల్​ మోడ్​కు మారిపోయాయి. కాలుష్యం పెరిగిన క్రమంలో కోర్టులు పూర్తిగా వర్చువల్‌‌ విధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో ఢిల్లీ పరిధిలోని అన్ని కోర్టుల్లో జడ్జీలు వర్చువల్​గా విచారణ చేపట్టాలని ఆదేశించినట్టు సీజేఐ సంజీవ్ ​ఖన్నా తెలిపారు.   లాయర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చెర్నోబిల్​లా నోయిడాలో ఆకాశం

విపరీతంగా పెరిగిన కాలుష్యంతో నోయిడాలో ఆకాశం రంగు మారిపోయి కనిపించింది. ఢిల్లీ ఎన్సీఆర్​ పరిధిలోని ఓ నివాసితుడు తీసిన ఫొటోలో దట్టమైన పొగమంచుతో పసుపురంగులో దర్శనమిచ్చింది. ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.  ఈ ఫొటో చెర్నోబిల్​ ఘటనను గుర్తుచేసిందని పలువురు కామెంట్​ చేయగా.. మరికొందరు  నెటిజన్లు డిజాస్టర్ ​మూవీస్​ తరహాలో ఉన్నదని  అభిప్రాయపడుతున్నారు.

కృత్రిమ వర్షం ఎలా కురిపిస్తారంటే?

క్లౌడ్​ సీడింగ్​ అనే అధునాతన సాంకేతికత ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. ఇందుకోసం సిల్వర్‌‌ అయోడైడ్‌‌, పొటాషియం అయోడైడ్‌‌, డ్రై ఐస్‌‌ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని విమానాల ద్వారా తీసుకెళ్లి మేఘాలపై స్ప్రే చేస్తారు. 

దీంతో  మేఘాలకు అంటుకున్న రసాయనాలు అతి చల్లటి నీటి ఆవిరిని తమ చుట్టూ చేరుకునేలా చేస్తాయి. నీటి ఆవిరితో కూడిన బిందువులు దట్టంగా తయారవుతాయి. ఈ బిందువులు పెద్దగా అయ్యి, చినుకుల రూపంలో వాన కురుస్తుంది.  అయితే, ఈ కృత్రిమ వర్షాన్ని ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కురిపించటం సాధ్యం కాదు. దీనికి అనువైన వాతావరణం అవసరం.