ఢిల్లీ లిక్కర్​ స్కాం రూ.1,100 కోట్లు .. రూ. 292 కోట్ల అవినీతిలో కవిత పాత్ర

ఢిల్లీ లిక్కర్​ స్కాం  రూ.1,100 కోట్లు ..  రూ. 292 కోట్ల అవినీతిలో కవిత పాత్ర
  • ఢిల్లీ లిక్కర్​ స్కాం  రూ.1,100 కోట్లు ..  రూ. 292 కోట్ల అవినీతిలో కవిత పాత్ర 
  • సప్లిమెంటరీ చార్జ్​షీట్​లో ఏ 32గా ప్రస్తావించిన ఈడీ
  • సాక్షులను కవిత బెదిరించారు.. ఆధారాలు ధ్వంసం చేశారు
  • విచారణకు సహకరించట్లేదు.. చట్ట పరంగా చర్యలు తీసుకోండి
  • మొత్తం 177 పేజీల బ్రీఫ్ కాపీలో కీలక అంశాల  ప్రస్తావన.. విచారణ జులై 3కు వాయిదా వేసిన కోర్టు
  • సీబీఐ కేసులో జ్యుడీషియల్​ కస్టడీ ఈ నెల 7వరకు పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్​ పాలసీలో రూ. 1,100 కోట్ల స్కామ్​ జరిగిందని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) తెలిపింది. ఇందులో రూ.100 కోట్ల ముడుపులు, ఇండో స్పిరిట్స్ ద్వారా రూ.192.8 కోట్ల లాభాల పేరుతో అక్రమార్జన జరిగిందని పేర్కొన్నది. బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కింగ్ పిన్​గా, ప్రధాన కుట్రదారుగా, లిక్కర్ పాలసీలో ప్రధాన లబ్ధిదారుగా ఉన్నారని ఆరోపించింది. మొత్తం రూ.292.8 కోట్ల అవినీతిలో కవిత పాత్ర కీలకమైందని పేర్కొన్నది. ఆప్ ముఖ్య నేతలతో కుమ్మక్కైన కవిత... శరత్ చంద్రా రెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు సౌత్ గ్రూపు  ప్రాతినిధ్యం వహించిందని 
వెల్లడించింది. 


లిక్కర్ స్కాంలో భారీ ఎత్తున మేలు పొందేందుకు వీలుగా రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారని ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను 32 వ నిందితురాలిగా ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ఇందుకు సంబంధించిన ఆధారాలు చార్జిషీట్ లో పొందుపరిచింది. ఈ సప్లిమెంటరీ చార్జిషీట్ లోని అంశాలను సంక్షిప్తంగా 177 పేజీల్లో ఈడీ కోర్టుకు సమర్పించింది. ఇందులో దాదాపు 110 పేజీలు కవిత కుట్ర కోణం గురించే ఈడీ ప్రస్తావించింది. మరో నలుగురు నేరస్తుల గురించి మిగిలిన పేజీల్లో వివరించింది. ప్రివెన్షన్​ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్( పీఎంఎల్ఏ) సెక్షన్ 44, 45 కింద స‌‌‌‌ప్లిమెంట‌‌‌‌రీ చార్జిషీట్ ను దాఖ‌‌‌‌లు చేసినట్టు తెలిపింది. 

డమ్మీ వ్యక్తుల ద్వారా ఆర్థిక నేరాలు

లిక్కర్​ స్కాంలో డమ్మీ వ్యక్తుల ద్వారా పెద్ద మొత్తంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఇండో స్వీట్స్ కంపెనీలో సౌత్ గ్రూప్​నకు 65% వాటా ఉండగా.. కవితకు లిక్కర్ స్కాంలో 33 శాతం వాటాలున్నాయని సహనిందితులు/అప్రూవర్లు ఇచ్చిన స్టేట్​మెంట్లను ప్రస్తావించింది. ఇదే విషయం బుచ్చిబాబు, రాఘవ్ మాగుంట వాట్సాప్ చాట్ లలో నిర్ధారణ అయిందని తెలిపింది. ఇక కేసు దర్యాప్తునకు సహకరించకపోగా.. సాక్షులను బెదిరించారని ఆరోపించింది. ఇందులో భాగంగా సహనిందితులుగా ఉన్న  మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ప్రాక్సీ అరుణ్ రామ చంద్ర పిళ్లైని కవిత బెదిరించారని వెల్లడించింది. ఈ విషయాన్ని బుచ్చిబాబు తన స్టేట్​మెంట్​లో వెల్లడించారని, అలాగే అరుణ్ పిళ్లై కవిత ఒత్తిడితో గతంలో తానిచ్చిన స్టేట్​మెంట్​ ను రిట్రాక్ట్(వెనక్కి) తీసుకున్నారని పేర్కొంది.  కీలక ఆధారాలను కవిత ధ్వంసం చేశారని ఆరోపించింది. 

పొలిటికల్ షో ఇచ్చారు 

లిక్కర్ పాలసీకి రూప కల్పనకు ముందు, ఆ తర్వాత రెండేండ్లు వాడిన ఫోన్లను సమర్పించాలని కవితను ఈడీ కోరిందని చెప్పారు. తొలుత ఒకటే ఫోన్ సమర్పించారని, మిగతా ఫోన్లు కోరగా.. 9 ఫోన్లను చూపిస్తూ కవిత ఈడీ ఆఫీస్ ముందు పొలిటికల్ షో చేశారని ఈడీ పేర్కొంది. ముఖ్యంగా ఈడీ నోటీసుల నేపథ్యంలో తాను క్రైం కోసం వాడిన ఫోన్లను కవిత ఫార్మాట్ చేసినట్టు ఈడీ ఆరోపించింది. ఇందులో ఫొటోలు, వాట్సాప్, ఇతర కమ్యూనికేషన్ యాప్ లు, ఫోన్ బాక్స్ గురించి ఆరా తీయగా, తెలియదని సమాచారం ఇచ్చినట్టు తెలిపింది. అలాగే, ఫోన్ల ఫార్మాట్ పై ప్రశ్నించగా, తాను వాడిన ఫోన్లను తమ ఇంట్లో సిబ్బందికి ఇచ్చానని, వాళ్లు ఫార్మాట్ చేసి ఉంటారనే సమాధానం చెప్పారని పేర్కొంది. . పీఎంఎల్ఏ సెక్షన్ 17 ప్రకారం తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, హ‌‌‌‌ర్యానా, త‌‌‌‌మిళ‌‌‌‌నాడు , ఇత‌‌‌‌ర ప్రాంతాల్లోని 24 స్థానాల్లో సోదాలు నిర్వహించినట్టు ఈడీ వెల్లడించింది. ఇప్పటి వ‌‌‌‌ర‌‌‌‌కూ లిక్కర్ స్కాంలో 18 మందిని అరెస్ట్ చేయగా.. శ‌‌‌‌ర‌‌‌‌త్ చంద్రారెడ్డి, దినేశ్​ అరోరా, రాఘ‌‌‌‌వ మాగుంట‌‌‌‌, రాజేశ్​ జోషి, గౌత‌‌‌‌మ్ మ‌‌‌‌ల్హోత్రా, బినోయ్ బాబు, సంజీవ్ సింఘ్, వినోద్ చౌహాన్ బెయిల్​పై ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో కవితతో సహా మొత్తం 49 మందిని విచారించినట్టు ఈడీ తెలిపింది. పీఎంఎల్ ఏ సెక్షన్ 50(2), (3) ప్రకారం.. క‌‌‌‌విత‌‌‌‌, మాగుంట శ్రీనివాసులు, రాఘవ మాగుంట‌‌‌‌, గోపి కుమార‌‌‌‌న్, శ‌‌‌‌ర‌‌‌‌త్ చంద్రా రెడ్డి, స‌‌‌‌మీర్ మ‌‌‌‌హేంద్రు, దినేశ్​ అరోరా, అరుణ్ పిళ్లై, వీ  శ్రీనివాస్, ఇత‌‌‌‌రుల వాంగ్మూలాలు రికార్డు చేసినట్లు వెల్లడించింది. ఈ స్కామ్​లో భాగమైన కవితతో పాటు నలుగురు సహనిందితులపై దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకొని.. వీరిని చట్ట పరంగా శిక్షించాలని ఈడీ కోర్టును కోరింది. 

కేజ్రీవాల్, సిసోడియాతో అగ్రిమెంట్ 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాతో కవిత అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళారుల ద్వారా ముడుపులు చేతులు మార్చారని తెలిపింది. అందువల్ల ఆప్ నేతలు ముందుగానే కవితకు లిక్కర్ పాలసీ డిటైల్స్ వెల్లడించినట్టు పేర్కొంది. అనంతరం కవిత ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా తన ప్రాక్సీ అరుణ్ రామచంద్ర పిళ్లై భాగస్వామ్యం అయ్యారని ఆరోపించింది. తర్వాత హోల్ సేలర్ మార్జిన్ ను 12 శాతానికి పెంచి రూ. 100 కోట్ల ముడుపుల్లో కొంత తిరిగి పొందారని పేర్కొంది. లిక్కర్ పాలసీ రూప కల్పన, పాలసీ తయారీకి వ్యతిరేకంగా దాఖలైన కేసు, ఈ స్కాంలో ప్రమేయం ఉన్న ముఖ్యుల వివరాలు, దర్యాప్తు సంస్థల విచారణ, పలువురి స్టేట్​మెంట్లు, చేతులు మారిన రూ. 100 కోట్ల కిక్ బ్యాగ్ ల వివరాలను ప్రస్తావించింది. ఇప్పటి వరకూ మొత్తం 18 అంశాలను పొందుపరిచిన ఈడీ.. లిక్కర్ స్కాంలో పలువురి వాంగ్మూలం, వాట్సాప్ చాట్స్ ను సేకరించి వాటి ఆధారంగా కవితను విచారించినట్టు తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతల తరఫున విజయ్ రూ. 100 కోట్లను కిక్ బ్యాక్ ల రూపంలో తీసుకున్నారని ఆరోపించింది. హవాలా రూపంలో రూ. 100 కోట్లను అరుణ్ రామ చంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి కో ఆర్డినేట్ చేసినట్టు పేర్కొంది. 

సహ నిందితులు, అప్రూవర్ల వాంగ్మూలం 

వంద కోట్ల చెల్లింపులపై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, సమీర్ మహేంద్రు, దినేశ్​ ఆరోరా, అరుణ్​ పిళ్లై వీ శ్రీనివాస్, బుచ్చిబాబు, శ్రీనివాసులరెడ్డి, రాఘువ మాగంట తదితరులు ఇచ్చిన సాక్ష్యాలతో నిర్ధారణకు వచ్చినట్లు ఈడీ తెలిపింది. లిక్కర్ వ్యాపారం చేసేందుకు మద్దతుగా రూ. 100 కోట్లు చెల్లించేందుకు కవిత అంగీకరించారని మాగుంట గతేడాది 14, 17 తేదీల్లో ఇచ్చిన స్టేట్​మెంట్స్​లో చెప్పారని పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 2021 మార్చి 16న తన ఆఫీసులో కలిసినప్పుడు ఈ అంశాన్ని వివరించారని తెలిపింది. హైదరాబాద్ లో ఆమెను కలుసుకున్నప్పుడు తాము చెల్లించాల్సిన రూ.100 కోట్లలో రూ.50 కోట్లు తన సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు ఇవ్వాల్సిందిగా తెలిపారని మాగుంట చెప్పారు. యజమాని సమీర్ మహేంద్రు కూడా ఈడీకి కవిత పాత్ర గురించి వెల్లడించారు. కవిత, మాగుంట, శరత్ చంద్రా రెడ్డి మొత్తం పెట్టుబడి పెడుతున్నారని ఆరుణ్ పిళ్లై తనకు చెప్పినట్టు ఆయన వెల్లడించారని తెలిపింది. కవితకు వ్యతిరేకంగా అరుణ్ రామచంద్ర పిళ్లై 11.11.2022, 16.02.23 లో ఇచ్చిన వివరాలు ఈ రిపోర్ట్ లో పేర్కొంది. ఇండో స్పిరిట్ తో భాగస్వామిగా కవిత రూ. 100 కోట్లు ఆప్ నేతకు అందజేశారని ఆరోపించింది. అలాగే, కవిత ఫ్యామిలీ ఫ్రెండ్, రిలేటివ్ వీ శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈడీ అటాచ్ చేసింది. బుచ్చిబాబు ప్రధానంగా ఆప్ నేత విజయ్ నాయర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా తరపున పాల్గొన్నట్లు 
అంగీకరించారని తెలిపింది.

చార్జిషీట్ లో కవిత స్టేట్​మెంట్​

తాము అడిగిన చాలా ప్రశ్నలకు కవిత ‘లేదు.. తెలీదు.. నాకు సంబంధం లేదు.. గుర్తుకు లేదు..’ అనే సమాధానాలు ఇచ్చారని ఈడీ వెల్లడించింది. గతేడాది మార్చిలో మూడు సార్లు, ఈ ఏడాది ఆరుసార్లు విచారణలో పేర్కొన్న అంశాలను సప్లిమెంటరీ ఛార్జిషీట్ లో ప్రస్తావించింది. తొలిసారి గతేడాది మార్చి 11 న ఈడీ విచారణలో కవిత వాంగ్మూలంలోని అంశాలను నమోదు చేసినట్లు ఈడీ చార్జిషీట్ లో పొందుపరిచింది. కవిత (6209999999, 8008666666) రెండు నెంబర్లు వాడారని, కానీ ఆ నెంబర్లు ఎవరి పేరు పైన ఉన్నాయో ఆమెకే తెలీదని తన వాంగ్మూలంలో అంగీకరించినట్టు ఈడీ పేర్కొంది. అంతే తప్ప బుచ్చిబాబు వాంగ్మూలంలో పేర్కొన్నట్టు లిక్కర్ కేసులో తన వంతు వ్యవహరించాలని/చర్చలు జరపాలని తాను ఆదేశాలు ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. 

అలాగే లిక్కర్ వ్యాపారం దక్కించుకున్న ఇండో స్పిరిట్ లో తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి భాగస్వామ్యం లేదని చెప్పారు. లిక్కర్ వ్యాపారం గురించి తాను ఎవరితో మాట్లాడలేదని అన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, లిక్కర్ వ్యాపారం తనకు సంబంధం లేదని, తన తరఫున ఎవరూ ఆప్ ను సంప్రదించలేదని, లంచాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. బుచ్చిబాబు, రాఘవ  మధ్య జరిగిన సంభాషణలు చూపిస్తే తనకు గుర్తులేదని, వాళ్ల నెంబర్లు కూడా తెల్వదని స్టేట్​మెంట్​ ఇచ్చారు. కానీ వాళ్ల మధ్య చాటింగ్ జరిగిందని కవిత అంగీకరించారు. అయితే అరుణ్ పిళ్లై తన ఫ్యామిలీ ఫ్రెండ్, వీకెండ్స్​లో తరుచూ  కలుస్తుంటామని, బతుకమ్మ వంటి ప్రోగ్రాంలను కలిసి నిర్వహించినట్టు చెప్పారు. గౌతమ్ ముత్తా కు చెందిన ఇండియా ఎహెడ్ చానల్ లో అభిషేక్ పెట్టుబడులు, ఇందుకోసం బుచ్చిబాబు సహకారం గురించి తనకు తెలియదని కవిత తన స్టేట్​మెంట్​లో పేర్కొన్నారు.

సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్​ కస్టడీ పొడిగింపు


ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషి యల్‌‌‌‌ కస్టడీని మరోసారి పొడిగించారు. జూన్‌‌‌‌ 7 వరకూ పొడిగిస్తూ రౌస్‌‌‌‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో విధించిన కస్టడీ ముగియడంతో.. సోమవారం మధ్యాహ్నం వర్చువల్ మోడ్ (వీసీ) ద్వారా ఆమెను కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు సజావుగా సాగాలంటే కవిత కస్టడీని పొడిగించాలని సీబీఐ తరపు అడ్వకేట్​ కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. కవిత జ్యుడీషియల్​ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది. ఈ కేసులో జూన్‌‌‌‌ 7న సీబీఐ చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేయనుంది.

ఒక్కోసారి ఒక్కోలా...


కవిత తన స్టేట్​మెంట్​లో ప్రతిసారి భిన్న వాంగ్మూలాలు ఇచ్చారని ఈడీ పేర్కొంది. గౌతమ్ ముత్తా కంపెనీలో ఇన్వెస్ట్ మెంట్స్ పై బుచ్చిబాబు కు కవిత వాట్సాప్ ద్వారా ఇచ్చిన ఆదేశాలపై.. వాట్సాప్ ఆధారాలు చూపి కవితను విచారించినట్టు తెలిపింది. ఈ టైంలో కవిత నాలుగుసార్లు విరుద్ధమైన స్టేట్​మెంట్లు ఇచ్చారని వెల్లడించింది. ఫస్ట్ టైం బుచ్చిబాబుతో తానెలాంటి చర్చలు జరపలేదన్న కవిత.. సెకండ్ స్టేట్​మెంట్​లో గౌతమ్ ముత్తా కంపెనీలో అభిషేక్ బోయినపల్లి పెట్టుబడుల గురించి తనకు తెలియదని అన్నట్టు ఈడీ తెలిపింది. మూడో సారి ఇండియా ఎహెడ్ న్యూస్ చానల్ లో తనకు ఎలాంటి పెట్టుబడులులేవని, నాలుగో సారి గౌతమ్ ముత్తాతో ఎలాంటి పెట్టుబడు లపై ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చించలేదని కవిత చెప్పినట్టు పేర్కొంది. ఫైనల్ గా ఈ ఆధారాలపై స్టేట్​మెంట్​ ఇచ్చేందుకు కవిత నిరాకరించారని తెలిపింది. 2019 లో తన ఓటమి తర్వాత విజయ్ నాయర్ రెండు సార్లు తనను కలిసినట్టు గుర్తుందని కవిత ఒప్పుకున్నట్టు ఈడీ తెలిపింది. ఇందులో ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ లో, సెకండ్ మీటింగ్ ఢిల్లీలో జరిగిందని స్టేట్​మెంట్​లో చెప్పారు. ఇక పలు ఐఎంఈఏ నెంబర్లతో కూడిన ఫోన్ల ను ఎప్పుడు వాడారో, ఆ తర్వాత ఎప్పుడు ఆపారో తనకు గుర్తుకు లేదని కవిత చెప్పారని పేర్కొంది.  

విచారణ జులై 3కు వాయిదా

కవిత, మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు జులై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై మే 10న ఈడీ దాదాపు 8 వేల పేజీలతో 6వ సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (అనుబంధ చార్జిషీట్) ను ఈడీ దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ చానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ ను చార్జిషీట్​లో నిందితులుగా పేర్కొంది. ఈ పిటిషన్ ను గత నెల 29న ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. అలాగే, నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించింది. 

ఇందులో భాగంగా సోమవారం ఉదయం కవిత ను నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.  మరో నలుగురిని స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత, చణ్ ప్రీత్ సింగ్ కు కస్టడీ పొడిగించగా.. అరెస్ట్ కాని ముగ్గురు నిందితు లకు రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. వారి పాస్ పోర్ట్ జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను జులై 3 కు వాయిదా వేస్తున్నట్టు జడ్జ్ కావేరి బవేజా వెల్లడించారు. అనంతరం కవితను కలిసేందుకు ఆమె భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులను కోర్టు అనుమతించింది. వారితో మాట్లాడిన అనంతరం పోలీసులు కవితను తీహార్ జైలుకు తరలించారు.