ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు కేంద్రం షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో వీరిని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)కు కేంద్ర హోంశాఖ అనుమతులిచ్చింది.
ALSO READ | 2024 ఎన్నికల్లో నిజంగా మోడీ ఓడిపోయారా..?: జుకర్ బర్గ్కు పార్లమెంటరీ కమిటీ నోటీసులు
ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్, సిసోడియాల విచారణకు అనుమతి కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈడీ గత నెల లేఖ రాసింది. అందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈవిషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లగా.. విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గతేడాది మార్చిలో అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ తొమ్మిది సమన్ల తర్వాత కూడా ఈడీ ముందు హాజరుకాకపోవడంతో మార్చి 21, 2024న అరెస్టు చేసింది. ఈడీ కేసులో జులై 12న, సీబీఐ కేసులో అదే ఏడాది సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. ఈ పరిణామాల నడుమ సెప్టెంబర్ 17న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇక సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ.. 12 రోజుల తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 9న అతనికి బెయిల్ మంజూరు చేసింది.