
న్యూఢిల్లీ: మహిళలకు ఢిల్లీ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే (మార్చి 8)ను పురస్కరించుకుని ‘మహిళా సమృద్ధి యోజన’ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం (మార్చి 8) ఢిల్లీ సీఎం రేఖాగుప్తా కీలక ప్రకటన చేశారు. ‘‘ఈ రోజు మహిళా దినోత్సవం. ఈ శుభ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ భేటీ నిర్వహించాము. మంత్రులందరి సమక్షంలో మేం ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని మా సోదరీమణులకు హామీ ఇచ్చిన మహిళా సమృద్ధి యోజన స్కీమ్‌కు ఆమోదం తెలిపాం. ఈ స్కీమ్ కింద ఢిల్లీలోని మహిళలకు రూ. 2500 ఆర్థిక సహయం అందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది’’ అని సీఎం రేఖాగుప్తా వెల్లడించారు.
ఈ స్కీమ్ అమలు కోసం బడ్జెట్లో రూ.రూ.5100 కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి తన నేతృత్వంలో మంత్రులు ఆశిష్ సూద్, పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రాలతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు రేఖాగుప్తా పేర్కొన్నారు. దరఖాస్తులు, లబ్ధిదారుల గుర్తింపు కోసం ఒక పోర్టల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం తాను కృషి చేస్తానని అన్నారు. మహిళల కోసం ఢిల్లీలో చిన్న టాయిలెట్లను నిర్మించామని చెప్పారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వమని అన్నారు. కాగా, మహిళా సమృద్ధి యోజన స్కీమ్ కింద ఆర్థికంగా వెనకబడిన బలహీన వర్గాలకు చెందిన ఢిల్లీ మహిళలకు ప్రభుత్వం నెలకు రూ.2,500 ఆర్థిక సహయం అందించనుంది. 2025, మార్చి 8న ఈ పథకం ప్రారంభం కానుండగా.. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ఈ పథకం అమలుకు ఇప్పటికే ఢిల్లీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. రూ.5100 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్లు కలిగి ఉండి బీపీఎల్ కార్డు ఉన్న మహిళలు పథకానికి అర్హులు.