
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం రేఖ గుప్తా భర్త మనీష్గుప్తా నడుపుతున్నారని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జల్ బోర్డు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు తదితర విభాగాల సీనియర్ అధికారుల సమావేశంలో శనివారం ఆయన పాల్గొన్నారని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో ఓ ఫొటోను ఆమె షేర్ చేశారు.
"ఈ ఫోటోను జాగ్రత్తగా చూడండి. ఎంసీడీ, డీజేబీ, పీడబ్ల్యూడీ, డీయూఎస్ఐబీ అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భర్త మనీశ్ గుప్తా" అని తన పోస్ట్‌లో రాశారు. ఈ ఘటనను ఆమె గ్రామీణ ప్రాంతాల్లో పాలనతో పోల్చారు. "ఓ గ్రామంలో ఒక మహిళా సర్పంచ్ ఎన్నికైతే.. అన్ని ప్రభుత్వ పనులను ఆమె భర్త నిర్వహిస్తారని గతంలో మనం వినేవాళ్లం. గ్రామంలోని మహిళలకు ప్రభుత్వ పనిని ఎలా నిర్వహించాలో తెలియదని.. కాబట్టి ఆ పనిని సర్పంచ్-భర్త నిర్వహిస్తారని చెప్పేవారు.
కానీ, దేశ చరిత్రలో ఒక మహిళా సీఎం భర్త ప్రభుత్వ పనులన్నింటినీ నిర్వహించడం ఇదే మొదటిసారి అయి ఉండాలి" అని ఆమె రాసుకొచ్చారు. "రేఖా గుప్తాకు ప్రభుత్వ పనులు ఎలా నిర్వహించాలో తెలియదా? ఢిల్లీలో ప్రతిరోజూ ఎక్కువసేపు విద్యుత్ కోతలకు ఇదే కారణమా? రేఖ విద్యుత్ సంస్థలను నిర్వహించలేకపోతున్నారా? ప్రైవేట్ పాఠశాలల ఫీజులు పెరగడానికీ ఇదే కారణమా? రేఖ విద్యా శాఖను నిర్వహించలేకపోతున్నారా? ఇది చాలా ప్రమాదకరం" అని ఆమె జోడించారు. ఈ పోస్ట్‌పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. అతిశీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. ఓ మహిళ.. మరో మహిళా నాయకురాలిని అవమానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.