ఫీజులు పెంచితే సహించేది లేదు.. ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ఫీజులు పెంచితే సహించేది లేదు.. ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి.. హఠాత్తుగా ఫీజుల పెంపు అంశాన్ని ముందుకు తీసుకువస్తున్నాయి. ఫీజులు పెంచడంతో కట్టుకోలేని మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు కట్టడం లేదని విద్యార్థులను గేటు బయట ఎండలో ఉంచడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అనుసరిస్తున్న విధానాలపై ఢిల్లీలో గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

మంగళవారం (ఏప్రిల్ 15) ఫీజుల పెంపుపై పేరెంట్స్ భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు. ఢిల్లీలోని ద్వారకా ప్రైవేట్ స్కూల్ ముందు తల్లిదండ్రులు భారీగా నిరసనలకు దిగారు. పనిష్మెంట్ పేరుతో 25 రోజులు పిల్లలను లైబ్రరీలోకి రాకుండా నిషేదించారని ఆరోపించారు. మార్చి 20, 2025 నుంచి పిల్లలను ‘లైబ్రరీ అరెస్ట్’ పేరున నిషేధిస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం స్కూళ్లను నియంత్రించడంలో విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడం సీఎం రేఖాగుప్తా దృష్టిలోకి వచ్చింది. పేరెంట్స్ మంగళవారం నేరుగా ముఖ్యమంత్రిని కలిసి స్కూల్స్ అవలంభిస్తున్న విధానాలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రైవేట్ స్కూల్స్ అనుసరిస్తున్న విధానాలపై పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచితే సహించేది లేదు. ఢిల్లీలో నో టోలరెన్స్ విధానం అమలులో ఉంటుంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. 

ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ ఈ అంశంపై స్పందించారు. ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత ద్వారకా స్కూల్ కు ఇన్స్పెక్షన్ టీమ్ ను పంపించడం జరిగింది. 18 ప్రశ్నలతో స్కూల్ లో అభిప్రాయాలు సేకరించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  

ఢిల్లీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. గుజరాత్ మోడల్ ఢిల్లీలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలందరినీ నిరక్ష్యరాస్యులను చేసి దోచుకోవడమే గుజరాత్ మోడల్ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.