- ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని
- కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం
- ఫాలో అవ్వాలంటూ ప్రైవేట్ సంస్థలకు రిక్వెస్ట్
- ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 426గా నమోదు
- 11 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్
న్యూఢిల్లీ : ఢిల్లీలో రోజురోజుకూ గాలి కాలుష్యం పెరుగుతుండటంతో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 50 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఫాలో కావాలని కోరింది. హెల్త్ కేర్, శానిటేషన్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, ఫైర్ సర్వీసెస్, లా ఎన్ ఫోర్స్ మెంట్, విద్యుత్ సరఫరా వంటి ఎమర్జెన్సీ కార్యకలాపాలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తూనే ఉంటాయని వెల్లడించింది.
ఢిల్లీ ప్రభుత్వంలో దాదాపు 80 విభాగాలు, వివిధ ఏజెన్సీలు ఉన్నాయని..వాటిలో సుమారు 1.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. ఇందులో 50% ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని.. మిగతావారు యథావిధిగా ఆఫీసులకు వెళతారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ గోపాల్ రాయ్ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రైవేట్ సంస్థలూ ముందుకు రావాలని కోరారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ప్రైవేట్ సంస్థలు ఆఫీసు వేళలను సవరించాలన్నారు. రోజూ ఉదయం 10:30 నుంచి 11:00 గంటల మధ్య ప్రారంభించాలని సూచించారు.
పొరుగు రాష్ట్రాలు విఫలం
ఢిల్లీలో పొల్యూషన్ పెరగడానికి బీజేపీనే కారణమని గోపాల్ రాయ్ ఆరోపించారు. ఢిల్లీ చుట్టూ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని.. ఆయా రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఢిల్లీ కాలుష్యానికి కారణమని మండిపడ్డారు. పొగతో కమ్మిన రాష్ట్రాన్ని పడిపోతున్న ఉష్ణోగ్రత మరింత దిగజార్చుతున్నదని.. విజిబులిటీ మరింత తగ్గిందని చెప్పారు.
ఏక్యూఐ 426గా రికార్డు
ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించడంతో పాటు టెంపరేచర్స్ కూడా పడిపోయాయి. మంగళవారం రాత్రి నగరంలోని కనిష్ట ఉష్ణోగ్రత 11.1 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా బుధవారం ఉదయం ఏక్యూఐ 426గా నమోదైంది.
పెండ్లి బారాత్‌లో టపాసులు
గురుగ్రామ్‌లో ఓ పెండ్లి బారాత్ సందర్భంగా వధూవరుల బంధువులు రోడ్డుపై ఫైర్ క్రాకర్స్ పేల్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. "ఇది బారాత్ లాగా లేదు. ఏక్యూఐ 1000 మార్కు చేరుకున్నందుకు పండుగ చేసుకుంటున్నట్లుంది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.