అంజలి బిర్లాపై పోస్టులను 24 గంటల్లోగా తొలగించండి: ‘గూగుల్’, ‘ఎక్స్’కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

అంజలి బిర్లాపై పోస్టులను 24 గంటల్లోగా తొలగించండి: ‘గూగుల్’, ‘ఎక్స్’కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె, ఐఆర్పీఎస్ అధికారి అంజలి బిర్లాకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెను కించపరుస్తూ, టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టులను వెంటనే తొలగించాలని గూగుల్కు, సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ‘ఎక్స్’కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంజలి బిర్లా పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్న పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలని ‘ఎక్స్’కు, గూగుల్కు స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’కు, గూగుల్కు నోటీసులు జారీ చేసింది. అంజలి బిర్లా తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షను క్లియర్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా కొందరు విమర్శలు చేశారు. 

Also Read:-బోరింగ్, లైఫ్లెస్ బడ్జెట్..భారత్ పే కోఫౌండర్ అష్నీర్ గ్రోవర్

లోక్ సభ స్పీకర్ అయిన తన తండ్రి ఓం బిర్లా పరపతిని అడ్డం పెట్టుకుని అంజలి బిర్లా యూపీఎస్సీని తొలి ప్రయత్నంలోనే క్లియర్ చేసిందని ఆరోపణలు చేస్తూ కొందరు నెటిజన్లు పోస్టులతో విరుచుకుపడ్డారు. ఈ పోస్టులు వైరల్గా మారి అంజలి బిర్లా దృష్టికి వెళ్లడంతో ఆన్లైన్ వేధింపులతో పాటు, పరువుకు భంగం కలిగించారని అంజలి బిర్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరపు కౌన్సిల్ మంగళవారం నాడు కోర్టులో తమ వాదన వినిపించింది. 2019లో ఆమె యూపీఎస్సీ పరీక్షను క్లియర్ చేశారని, ఇండియన్ రైల్వేస్లో ఐఆర్పీఎస్ అధికారిగా విధుల్లో ఉన్నారని ఆమె తరపు కౌన్సిల్ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.