రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే ఆ వీడియో తొలగించాలని ఆదేశాలు

రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు సీరియస్.. వెంటనే ఆ వీడియో తొలగించాలని ఆదేశాలు

న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. హమ్దార్ షర్బత్పై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు షాక్కు గురిచేశాయని ఢిల్లీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రాందేవ్ వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ‘‘హమ్దార్ షర్బత్ తాగితే ఆ డబ్బులతో మసీదులు, మదర్సాలు నిర్మిస్తారు. అదే పతంజలి తయారు చేసే గులబ్ షర్బత్ తాగితే గురుకులాలు, పతంజలి యూనివర్సిటీ, భారతీయ శిక్షా బోర్డ్ నిర్మాణాలు జరుగుతాయి’’ అని రాందేవ్ బాబా విడుదల చేసిన వీడియో నెట్టింట వివాదాస్పమైంది.

ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాందేవ్ బాబా మాట్లాడారని సోషల్ మీడియాలో వివాదం రేగింది. రాందేవ్ రికార్డ్ చేసిన ఈ వీడియోకు ‘షర్బత్ జిహాద్’ అని టైటిల్ పెట్టడం మరింత వివాదానికి దారితీసింది. ఈ వీడియోలో సదరు కంపెనీ పేరును ప్రస్తావించకపోయినా.. ‘హమ్దార్’ కంపెనీకి చెందిన ‘రూ అఫ్జా’ గురించే రాందేవ్ మాట్లాడినట్లు మీడియా సంస్థల్లో కథనాలు ప్రసారం కావడంతో రాందేవ్ బాబా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పతంజలి షర్బత్ అమ్ముకోవడానికి.. హిందూ, ముస్లింల మధ్య రాందేవ్ బాబా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నెటిజన్లు విమర్శించారు.