సినిమా వాళ్లపై అసభ్యకర వీడియోలు చేస్తూన్న సోషల్ మీడియా యూట్యూబర్స్ పై టాలీవుడ్ హీరో, MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu) ఇటీవలే అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. 48 గంటల టైం ఇచ్చి అసభ్యకర కంటెంట్ డిలీట్ చేయని పలు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించాడు.
ఈ నేపథ్యంలో మంచు విష్ణుకి వ్యతిరేకంగా యూట్యూబ్ చానెళ్లలో ఉన్న వీడియోలు, కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తి ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలిగించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆయన స్వరం, ఆయన పేరు, ఆయన తీసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు.
Also Read:-రతన్ టాటా ఓ సినిమా కూడా తీశారు
ఈ మేరకు పది యూట్యూబ్ లింక్‌లకు హైకోర్టు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, అసభ్యకరమైన విషయాలు, ఏ పద్ధతిలోనైనా ప్రచురణ లేదా ప్రచారం చేయకుండా కోర్టు తీర్పునిచ్చింది. విష్ణు మంచు పేరు, స్వరం, చిత్రము, లేదా ఏ ఇతర ప్రత్యేక లక్షణాలను వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనం కోసం అనధికారికంగా వినియోగించకూడదని తెలిపింది. విష్ణు మంచు వ్యక్తిత్వ/ప్రచారం హక్కులను అపహరించడం, దుర్వినియోగం చేయడం వంటివి చేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇప్పటివరకు మంచు విష్ణు తీసుకున్న చర్యల ద్వారా అసభ్యకర కంటెంట్ ను తీసుకొచ్చే పలు యూట్యూబ్ ఛానళ్ల 75 లింకులు తొలగించబడ్డాయి. దీంతో సెలబ్రిటీలకు ఒక సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం ముందడుగు పడినట్టు అయింది.
ఇక ప్రస్తుతం కోర్టు తీర్పుతో అసభ్యకరమైన సమాచారాన్ని కలిగిన యూట్యూబ్ ఛానళ్ల లింకులని 48 గంటలలోపు నిలిపివేయాలని ఐటీ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని సూచించింది.