సిసోడియాకు నో బెయిల్​ : ఢిల్లీ హైకోర్టు

సిసోడియాకు నో బెయిల్​ : ఢిల్లీ హైకోర్టు
  • క్యాష్ దొరకనంత మాత్రాన అవినీతి జరగలేదని చెప్పలేమన్న ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: క్యాష్ దొరకనంత మాత్రాన అక్కడ అవినీతి జరగలేదని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. నేరస్తుడు ఎలాంటి ఆధారాలు వదలకుండా నేరాలు చేయడానికి కొత్త సాంకేతికతను  ఉపయోగిస్తుంటాడని చెప్పింది. లిక్కర్ స్కామ్​లో ఈడీ, సీబీఐ కేసుల్లో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్స్ ను తోసిపుచ్చుతూ ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

మంగళవారం బెయిల్ పిటిషన్స్ ను కొట్టేయగా బుధవారం డీటైల్డ్ ఆర్డర్​ను హైకోర్టు వెబ్​సైట్​లో అప్ లోడ్ చేసింది. ఈ కేసులలో మనీలాండరింగ్​తో పాటు ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి వంటి ఆరోపణలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఈ ఆరోపణలు ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై ప్రభావం చూపడటంతో పాటు ప్రభుత్వ సంస్థలపై ప్రజా విశ్వాసం సన్నగిల్లేలా చేస్తాయని వెల్లడించింది. పేద, సామాన్యమైన ప్రజల నుంచి వనరులను దొంగిలించి ధనికులకు ఇవ్వడం అత్యంత చెత్తరూపమైన అవినీతి అని కోర్టు అభిప్రాయపడింది. 

ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాలను కల్పిస్తున్న సామాన్య ప్రజలు నిర్వహిస్తున్న చిన్న, మధ్య తరహా సంస్థలు ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అవినీతి దుష్ప్రభావాలకు లోనవుతాయని కోర్టు వివరించింది. సాధారణ, చిన్న- వ్యాపారాలను ఎక్సైజ్ పాలసీ నిర్మూలించి ఆర్థిక లాభాల ఆధారంగా డబ్బు, అధికారం, కార్టెల్​గా మారిన వారికి మొత్తం లిక్కర్ వ్యాపారాన్ని ఇచ్చిందని స్పష్టం చేసింది. ఇది నేరం యొక్క తీవ్రతను పెంచుతుందని పేర్కొంది.  మనీశ్ సిసోడియా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపింది. ఆయన ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వంచించారని చెప్పింది. మనీశ్ సిసోడియాకు బెయిల్​ను నిరాకరిస్తూ తీర్పును వెలువరించింది.