
Service Charge: రెస్టారెంట్లకు ప్రజలు వెళ్లటం నేటి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో అక్కడి తినేది తక్కువ వచ్చే బిల్లు ఎక్కువలాగా మారిపోతోంది పరిస్థితి. ఈ క్రమంలో కొన్ని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి జీఎస్టీతో పాటు సర్వీస్ ఛార్జీని కూడా వసూలు చేస్తున్నాయి.
అయితే వినియోగదారుల నుంచి బలవంతంగా లేదా తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీలను వసూలు చేయటం సరి కాదని 2022లో వినియోగదారుల సంఘం ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే విషయంపై దిల్లీ హైకోర్టు స్పందిస్తూ గతంలోని ఉత్తర్వులను సమర్థించింది. దీని ప్రకారం రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి సర్వీసు ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేయటం తప్పనిసరి కాదని వెల్లడించింది.
ALSO READ | అదరగొడుతున్న సృష్టి సుందరం.. ఫుడ్ టెక్నాలజీలో సంచలనం
హోటళ్లలో ఫుడ్ బిల్లులపై సర్వీసు ఛార్జీ చెల్లించటం వినియోగదారుల విచక్షణకు సంబంధించిన విషయమని, ఈ విషయంలో వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. హోటళ్ళు మరియు రెస్టారెంట్లు ఆహార బిల్లులపై సేవా ఛార్జీలను తప్పనిసరి చేయడాన్ని నిషేధించే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) మార్గదర్శకాలను సవాలు చేస్తూ రెస్టారెంట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ శుక్రవారం ఈ తీర్పును ఇచ్చారు. అలాగే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ మార్గదర్శకాలను సవాలు చేసిన రెస్టారెంట్ అసోసియేషన్లపై హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించారు.
వాస్తవానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) ఒక సలహా సంస్థ కాదని, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి మరియు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మార్గదర్శకాలను జారీ చేసే అధికారం కలిగి ఉన్న సంస్థగా దిల్లీ హైకోర్టు గమనించింది. గతంలో కూడా కొన్ని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఆహార బిల్లులపై సర్వీసు ఛార్జీలను తప్పనిసరిగా వసూలు చేసిన సంఘటనలు జరిగాయి. కస్టమర్లు ఈ విషయంలో తమ విచక్షణ మేరకు ఛార్జీల చెల్లింపు ఉంటుందని, తప్పనిసరి కాదని కోర్టు తీర్పు నుంచి అర్థం చేసుకోవాలి.
2022లో CCPA మార్గదర్శకాలను జారీ చేస్తూ.. రెస్టారెంట్లు కస్టమర్ల నుంచి డిఫాల్ట్‌గా ఆహార బిల్లుకు సర్వీస్ ఛార్జీని జోడించలేవని, లేదా సదరు ఛార్జీలను మరే ఇతర పేరు కింద దాచిపెట్టరాదని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో హోటళ్ళు, రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీ చెల్లించమంటూ బలవంతం చేయడాన్ని కూడా నిషేధించింది. అలాగే సర్వీస్ ఛార్జీలను ఆహార బిల్లుకు యాడ్ చేయటం దానిపై జీఎస్టీని వసూలు చేయటాన్ని నిషేధించింది.