స్కూళ్లలో ఫోన్లను పూర్తిగా నిషేధించలేం : ఢిల్లీ హైకోర్ట్

స్కూళ్లలో ఫోన్లను పూర్తిగా నిషేధించలేం :  ఢిల్లీ  హైకోర్ట్
  • ఫోన్ల వాడకంపై నియంత్రణ మాత్రం ఉండాలి: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: స్కూళ్లల్లో విద్యార్థులు మొబైల్‌‌ ఫోన్లను ఉపయోగించడంపై పూర్తి నిషేధం ఆచరణ సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అయితే, ఫోన్ల వినియోగాన్ని నియంత్రించడంలో ఒక నిర్దిష్టమైన విధానం అవసరమని జస్టిస్‌‌ అనూప్ జైరామ్‌‌ భంబానీ నేతృత్వంలోని బెంచ్‌‌ స్పష్టం చేసింది. అలాగే, ఫోన్లను అనుమతించే విషయంలో, వాటిని వినియోగించే విషయంలో దుర్వినియోగం జరగకుండా ఓ విధానం ఉండాలని పేర్కొంది. స్మార్ట్‌‌ ఫోన్‌‌ వాడకం వల్ల కలిగే నష్టాలతో పాటు స్టూడెంట్ల భద్రత కోసం, పేరెంట్స్‌‌తో కమ్యూనికేషన్‌‌ను సులభతరం చేయడంలో ఫోన్‌‌ వాడకాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే, మొబైల్‌‌ ఫోన్లను విద్యార్థులు స్కూళ్లకు తీసుకెళ్లకుండా నిషేధించకూడదని పేర్కొంటూ.. ఫోన్ల వినియోగాన్ని నియంత్రించడంతో పాటు పర్యవేక్షణ ఉండాలని ఫిబ్రవరి 28 నాటి ఉత్తర్వుల్లో వెల్లడించింది.

 కేంద్రీయ విద్యాలయ (ద్వారక)లో టెన్త్‌‌ క్లాస్‌‌ స్టూడెంట్‌‌ క్లాస్‌‌ రూమ్‌‌లో ఓ టీచర్ ఫొటో తీసి సోషల్‌‌ మీడియాలో అప్‌‌లోడ్‌‌ చేశాడు. దీంతో స్కూల్‌‌ యాజమాన్యం అతన్ని క్లాసులకు హాజరుకాకుండా, పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు విచారించింది. అయితే, ఆ స్టూడెంట్‌‌ను మరో బ్రాంచ్‌‌కు బదిలీ చేసి, ఎగ్జామ్స్‌‌కు హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది. స్మార్ట్‌‌ ఫోన్ల వినియోగంపై స్టూడెంట్లకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది. ఫోన్‌‌ వాడకంపై పేరెంట్స్‌‌, టీచర్లు, నిపుణులతో కలిసి విద్యాసంస్థలు ఓ పాలసీని రూపొందించుకోవాలని చెప్పింది.