హోటల్‌కు రూ.23లక్షలు ఎగ్గొట్టిన చీటర్ అరెస్ట్

యూఏఈకి చెందిన బిజినెస్ మెన్ అని అబద్దం చెప్పి..  ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ సిబ్బందిని బురిడీ కొట్టించిన మహమ్మద్ షరీప్ (41) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను కర్ణాటకలోని దక్షిణ కన్నడకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. నకిలీ బిజినెస్ కార్డు సృష్టించి గతేడాది మూడు నెలల పాటు హోటల్ లోనే ఉన్నట్టు తెలిపారు. అంతే కాదు.. హోటల్ లోని అన్ని సౌకర్యాలను వాడుకొని.. దాదాపు రూ.23లక్షలకు పైగా బిల్లు చేశాడు.

దానికి తోడు ఆ మొత్తాన్ని చెల్లించకుండా.. హోటల్ లోని విలువైన వస్తువులను సైతం దొంగిలించి.. పరారయ్యాడు. అనంతరం హోటల్ మేనజర్ అనుపమ్ దాస్ గుప్తా ఫిర్యాదు మేరకు జనవరి 14న సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్ లో షరీప్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంతో అతని మీద సెక్షన్ 419 420 380 సెక్షన్ల కింద పోలీసులు కేసు బుక్ చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. జనవరి 19న దక్షిణ కన్నడలో అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు.