జాతీయ రాజకీయాల్లో లిక్కర్​ స్కామ్​ ఎఫెక్ట్​ ఎంత?

నిజాయతీ అనే ఇమేజ్​తో రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ, పంజాబ్​లో అధికారం చేపట్టిన ఆప్​ అధినేత కేజ్రీవాల్, ఉద్యమ నేతగా ఎదిగి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై ఫోకస్​ పెట్టారు. కానీ వీరిద్దరూ ఇబ్బంది పడుతున్న కామన్ ​సమస్య ఢిల్లీ లిక్కర్​స్కామ్. ఈ కుంభకోణాన్ని వీరు ఎలా ఎదుర్కొంటున్నారు? జాతీయ రాజకీయాలపై ఈ స్కామ్​ఎలాంటి ఎఫెక్ట్​ చూపనుందనేది ఆసక్తికరంగా మారింది.

లాలూ ప్రసాద్ ల్యాండ్–ఫర్–జాబ్స్ స్కామ్, జార్ఖండ్ మైనింగ్ కుంభకోణం, హర్యానా టీచర్ రిక్రూట్​మెంట్ స్కామ్ ఇలా ప్రాంతీయంగా అనేక స్కామ్‌‌లు వెలుగుచూశాయి. వీటిలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, హర్యానాకు చెందిన చౌతాలా జైలుకు వెళ్లారు. ఢిల్లీ లిక్కర్​ స్కామ్ లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, ఇతర నేతల ప్రమేయంపై జాతీయ స్థాయిలో ప్రభావం పడనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ నేతలను దృష్టిలో పెట్టుకుని బయటకు రాలేదు. లోకల్​గా షాపులు కోల్పోయిన స్థానిక వ్యాపారుల నుంచి లెప్టినెంట్​గవర్నర్​కు ఫిర్యాదులొచ్చాయి. కొంతమందికి ప్రయోజనం చేకూర్చడానికి మద్యం పాలసీని మార్చారు. ఎక్సైజ్ పాలసీని మార్చే క్రమంలో అవినీతి జరిగిందని ఢిల్లీ వ్యాపారులు ఆరోపించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐని విచారించాలని కోరారు. ఫిర్యాదులో తెలంగాణ లేదు. దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. తెలుగు వ్యాపారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలా తెలంగాణ – -ఆంధ్రా కోణం బయటపడింది. మాజీ హోంమంత్రి చిదంబరం జైలుకు వెళ్లారు. ఆయన కుమారుడిపై అవినీతి ఆరోపణల కారణంగా జైలుకు వెళ్లలేదు. ముంబైలో ఇంద్రాణి ముఖర్జీ హత్య కేసులో విచారణ జరుగుతుండగా చిదంబరం చిక్కాడు. ఆ విచారణలో చిదంబరానికి రూ.5 కోట్లు చెల్లించినట్లు సీబీఐ గుర్తించింది. విదేశీ లైసెన్స్ కోసం చిదంబరానికి లంచం ఇచ్చినట్లు ఇంద్రాణి ధ్రువీకరించారు. చిదంబరం అలా జైలులో కూర్చోవాల్సి వచ్చింది.

కాంగ్రెస్​తో కలవడమేనా?

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​తో అత్యధికంగా నష్టపోయిన వ్యక్తి కేజ్రీవాల్. ఎందుకంటే ఆయన పేదల పార్టీ పేరుతో.. నిజాయతీ పునాదులపై ఎన్నికల్లో గెలిచారు. ఢిల్లీ, పంజాబ్‌‌లను ఆయన నియంత్రించారు. కానీ లిక్కర్​స్కామ్​లో ఇప్పుడు ఆయన ఉపముఖ్యమంత్రి జైలులో ఉన్నారు. దీంతో కేజ్రీవాల్‌‌కు ఉన్న నిజాయతీ ఇమేజ్ మొత్తం పోయింది. లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బును గుర్తిస్తే.. కేజ్రీవాల్‌‌పై కూడా అభియోగాలు మోపవచ్చు. స్కామ్ గురించి కేజ్రీవాల్‌‌కు తెలుసని ఈడీ రుజువు చేస్తే, ఆయన కూడా జైలుకు వెళ్లవచ్చు. కేజ్రీవాల్‌‌ ఎదుర్కొంటున్న తీవ్ర అస్తిత్వ సంక్షోభాన్ని కేసీఆర్‌‌ లేదా ఆయన పార్టీ బీఆర్‌‌ఎస్‌‌ ఎదుర్కోవడం లేదు. కేజ్రీవాల్‌‌కి ఉన్న నిజాయతీ అనే ప్రతిరూపం పోతే, ఆయన పని అయిపోయినట్లే. ఢిల్లీ, పంజాబ్‌‌లలో కాంగ్రెస్‌‌, బీజేపీ రెండింటినీ కేజ్రీవాల్‌‌ ఓడించారు. అందుకే ఆయనను ఇంటికి పంపితే కాంగ్రెస్, బీజేపీ రెండూ లాభపడతాయి. లిక్కర్​ స్కామ్​తో కాంగ్రెస్ పార్టీకి ఊహించని బోనస్ లభించింది. గత పదేళ్లుగా కాంగ్రెస్‌‌కు కేజ్రీవాల్‌‌, కేసీఆర్‌‌ ఇద్దరూ ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా కేజ్రీవాల్, కేసీఆర్ పార్టీ నేతలు కాంగ్రెస్ ఆఫీసుల్లో కనిపిస్తున్నారు. కేసీఆర్, కేజ్రీవాల్‌‌లు తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్‌‌ల నుంచి కాంగ్రెస్‌‌ను తరిమికొట్టారు. ఇప్పుడు కేజ్రీవాల్‌‌, కేసీఆర్‌‌ కాంగ్రెస్‌‌తో కలిసి కేంద్రంపై గొంతెత్తుతున్నారు. ఇంతలోనే ఎంత మార్పు! ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు ఇచ్చేంత వరకు కూడా సీఎం కేసీఆర్ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌‌ ఢీ అంటే ఢీ అన్నట్లే ఉన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌‌తో పోరాడి, ఢిల్లీలో కేంద్రంపై యుద్ధం చేసేందుకు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారా? ఇకనైనా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనేది కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేజ్రీవాల్‌‌కు కూడా కేసీఆర్‌‌కు ఎదురైన పరిస్థితే ఉన్నది. ఆయన రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌‌కు తీవ్ర వ్యతిరేకి. ఇప్పుడు కేజ్రీవాల్​ఎంపీలు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కాళ్ల దగ్గర కూర్చున్నారు. కాంగ్రెస్‌‌తో కలిసి పోరాడాలా వద్దా అనేది కేజ్రీవాల్ నిర్ణయించుకోవాలి.

కర్నాటక ఎన్నికల్లో పోటీపై..

ఎన్నికల సంఘం కర్నాటక ఎన్నికల షెడ్యూల్​ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అధికార పీఠం కోసం పోడీపడుతున్నాయి. మరి జాతీయ పార్టీలుగా, జాతీయ నేతలుగా చెప్పుకుంటున్న సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్ అక్కడ పోటీ చేస్తారా? అక్కడ పోటీ చేస్తారా లేదా అన్నదే కేసీఆర్, కేజ్రీవాల్‌‌లకు ఇప్పుడు అతిపెద్ద పరీక్ష. కర్నాటక ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేస్తే.. జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కొంత స్కోప్ ​ఉంటుంది. అలా కాకుండా వీరిద్దరూ కర్నాటక ఎన్నికలకు దూరంగా ఉంటే, తమ జాతీయ ఆశలను వదులుకున్నట్టే అవుతుంది. వారిపై నమ్మకం పోతుంది. రాబోయే కర్నాటక ఎన్నికల పరీక్ష, ప్రస్తుతం జరుగుతున్న లిక్కర్​ స్కామ్ విచారణలను కేసీఆర్, కేజ్రీవాల్ ఎలా నిర్వహిస్తారో చూడాలి. వారికి ప్రమాదం బయటి నుంచి కాదు.. లోపల నుంచే.

లిక్కర్​ స్కామ్​ను కేసీఆర్ ఎలా హ్యాండిల్​ చేస్తున్నారు?

కేసీఆర్ విస్తృతంగా చదివే వ్యక్తి అని, సుదీర్ఘ ముందు చూపు ఉన్న రాజకీయ నాయకుడు అని చాలా మంది అంటుంటారు. అది నిజమైతే, కరుణానిధి కుమార్తె కనిమొళి, మంత్రులు దయానిధి మారన్, ఎ. రాజా జైలుకు వెళ్లిన సందర్భంలో టెలికాం అవినీతి కేసును డీఎంకే ఎలా నిర్వహించిందో ఆయన అధ్యయనం చేసి ఉండాలి. అలాంటి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో మంచి పాఠాలు ఉన్నాయి. తమ మంత్రులు ఎ. రాజా, దయానిధి మారన్, కరుణానిధి కుమార్తె కనిమొళి అరెస్టులు.. పెళ్లి ఊరేగింపు ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా జరిగేలా, అదే విధంగా బయటకు వచ్చేలా డీఎంకే సరిగ్గా నిర్వహించింది. ఆ ముగ్గురు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు. లిక్కర్​ స్కామ్​ను కేసీఆర్, కేజ్రీవాల్ సరిగ్గా హ్యాండిల్ ​చేశారా? లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అయితే లిక్కర్​ స్కామ్​ను ఎదుర్కొనే విషయంలో కేసీఆర్, కేజ్రీవాల్ ఇద్దరూ భయాందోళనలకు గురైనట్లే కనిపించింది. సహజంగా సంక్షోభ సమయంలో చుట్టూ చేరే భజనపరులు.. పనికిరాని అడ్వయిజ్​లు ఇచ్చి పరిస్థితిని మరింత దిగజారుస్తుంటారు.

సిసోడియా చేసింది తప్పే!

లిక్కర్​స్కామ్​ విషయంలో సిసోడియా ఓ రకంగా పొరపాటే చేశారు. తనకు శిక్ష పడుతుందని తెలిసి కూడా పెళ్లి కొడుకులా సీబీఐ కార్యాలయానికి భారీ కాన్వాయ్​లో వెళ్లాడు. జైలుకు వెళ్లడం నిజంగా సంతోషంగా ఉందంటూ సిసోడియా నవ్వారు. ప్రజలు తెలివైనవారు సిసోడియా భయపడ్డారని, ఆనందం నటిస్తున్నారని అర్థం చేసుకున్నారు. ఇలాంటి తెలివి తక్కువ ఆర్భాటమే బీఆర్ఎస్​ పార్టీ చేస్తూ.. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది. బీఆర్ఎస్​ తీరుతో కేజ్రీవాల్​ ఓ రకంగా ఇబ్బంది పడుతున్నారు.
–డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్