న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను ఆప్ ముఖ్యనేతలు తెలంగాణకు విస్తరించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత ఉన్నారని గుర్తుచేశారు. ఈ స్కామ్‌తో ఢిల్లీ ప్రజలు తలదించుకునే పరిస్థితికి ఆప్ సర్కార్ తెచ్చిందన్నారు.
ఆదివారం బీజేపీ నేతలు బండారి శాంతికుమార్, నూనె బాల్‌రాజ్‌తో కలిసి ఈస్ట్ ఢిల్లీ షాద్రాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొని, మాట్లాడారు. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. ఢిల్లీ అభివృద్ధికి మలుపుగా మారనుందన్నారు. అవినీతికి ఆనవాళ్లుగా ఉన్న ఆప్ నేతలను, ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఢిల్లీలో రూ.28 వేల కోట్ల జల్ బోర్డు స్కాం, రూ.4,500 కోట్ల బస్సుల కొనుగోలు కుంభకోణం, బస్సుల్లో సదుపాయాల పేరుతో రూ.500 కోట్ల దుర్వినియోగం, నకిలీ హెల్త్ టెస్టుల ద్వారా కోట్ల అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మహిళా సమృద్ధి యోజన’స్కీం కింద అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, రూ.500కే ఉచిత గ్యాస్ సిలిండర్, సీఎం మాతృత్వ భద్రతా పథకం కింద గర్భిణులకు రూ.21,000తో పాటు 6 పోషకాహార కిట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అర్హత కలిగిన లబ్ధిదారులకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.