700 మంది మహిళలను డేటింగ్ యాప్లతో మోసగించిండు.. ప్రైవేటు వీడియోల సేకరణ.. ఆపై బ్లాక్​మెయిల్​

700 మంది మహిళలను  డేటింగ్  యాప్లతో మోసగించిండు..  ప్రైవేటు వీడియోల సేకరణ.. ఆపై బ్లాక్​మెయిల్​

న్యూఢిల్లీ: బ్రెజిలియన్  మోడల్  అంటూ డేటింగ్  యాప్​లలో మహిళలతో పరిచయం చేసుకుని 700 మందిని అతను మోసగించాడు. క్రమంగా నమ్మకం ఏర్పరచుకుని వారి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు రాబట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని ఆన్ లైన్ లో పెడతానని బ్లాక్ మెయిల్  చేశాడు. చివరికి ఓ యువతి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 

నిందితుడిని ఢిల్లీకి చెందిన తుషార్  బిష్త్ (23) గా గుర్తించారు. తుషార్  బీబీఏ పూర్తిచేసి నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో రిక్రూటర్ గా పనిచేస్తున్నాడు. మొదట్లో సరదా కోసం బంబుల్, స్నాప్ చాట్  వంటి డేటింగ్  యాప్ లలో మహిళలతో స్నేహం చేశాడు. వారిని మోసంచేసి ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్  చేశాడు. దీంతో తాను అమెరికాకు చెందిన బ్రెజిలియన్  మోడల్  అంటూ ఫేక్  ఫొటోలు పెట్టుకుని బాధితులను నమ్మించాడు. ఫ్రీలాన్స్  మోడల్ గా పనిచేస్తున్నానని పేర్కొన్నాడు. ఇందుకోసం నకిలీ ఐడెంటిటీ కార్డులు, వర్చువల్  ఇంటర్నేషనల్  మొబైల్  నంబర్, బ్రెజిలియన్  మోడల్  ఫొటోలు షేర్  చేశాడు. 

క్రమంగా మహిళలతో చాటింగ్  చేస్తూ వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్నవారిని టార్గెట్ గా చేసుకున్నాడు. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పంపాలని చెప్పడంతో బాధితులు అలాగే చేశారు. తర్వాత నిందితుడు తన అసలురూపం చూపడం ప్రారంభించాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేకపోతే మీ ప్రైవేటు ఫొటోలు, వీడియోలను ఆన్ లైన్ లో పెడతానని బెదిరించాడు. ఇలా 700 మందిని బ్లాక్ మెయిల్  చేసి అందినకాడికి దోచుకున్నాడు. 

ఇలా దొరికాడు

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ స్టూడెంట్ తోనూ ఓ డేటింగ్  యాప్ లో తుషార్  బిష్త్   పరిచయం పెంచుకున్నాడు. చాటింగ్  చేస్తూ  నమ్మకం చూరగొని ప్రైవేటు ఫొటోలు, వీడియోలు పొందాడు. ఓ రోజు ఆ ప్రైవేటు వీడియో పంపి డబ్బు ఇవ్వాలని, లేకపోతే ఆన్ లైన్ లో పెడతానని బెదిరించాడు. మొదట్లో అతను అడిగినంత డబ్బును బాధితురాలు పంపించింది. ఇంకా డబ్బు కావాలని బ్లాక్ మెయిల్  చేస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  నిందితుడు ఈస్ట్  ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.