మిగతా రాష్ట్రాలకు ఆదర్శం
కేంద్ర, రాష్ట్రాల పనితీరు భేష్
కేంద్ర మంత్రులతో రివ్యూ మీటింగ్లో మోడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి బాగుందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మెచ్చుకున్నారు. వైరస్ను కంట్రోల్ చేయడంలో లోకల్ అథారిటీ బాగా పనిచేస్తోందని, మిగతా రాష్ట్రాలు కూడా ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎన్సీఆర్ ఏరియాలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని అన్నారు. వైరస్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేషనల్ లెవెల్లో మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని, కేసులు పెరగకుండా సరైన గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. ఈమేరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి, వైరస్ను ఎదుర్కోవడంలో రాష్ట్రాల ప్రిపేర్నెస్.. తదితర అంశాలపై అధికారులతో జరిగిన భేటీలో ప్రధాని మోడీ ఈ కామెంట్స్ చేశారని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. పబ్లిక్ ప్లేసుల్లో ఫిజికల్ డిస్టెన్స్ తో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై అవగాహన పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి నిరక్ష్ల్యానికి చోటివ్వద్దని తెలిపారు.
ఇబ్బందులను తొలగించాం..
కరోనా కంట్రోల్ చర్యలపై ప్రధాని జరిపిన రివ్యూ మీటింగ్లో కేంద్ర మంత్రులు అమిత్షా, హరవర్షన్ లతో పాటు కేబినెట్ సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా కట్టడికి పోయిన నెలలో తీసుకున్న చర్యలను అమిత్ షా ప్రధాని మోడీకి వివరించారు. వైరస్ కేసులు పెరగడం, హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత, లేబరేటరీలలో కరోనా టెస్టులు చేయట్లేదన్న కంప్లైంట్స్.. ఈ సమస్యలను పరిశీలించి, పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్సీఆర్ రీజియన్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఢిల్లీ, హర్యానా, యూపీ ప్రభుత్వాలతో చర్చించినట్లు వివరించారు. కరోనా బాధితులకు అవసరమైన సాయం అందించేందుకు అహ్మదాబాద్లో అమలు చేస్తున్న ‘ధన్వంతరి రథ్’ పథకం బాగుందని, మిగతా చోట్లకూడా ఇలాంటి పద్ధతిని అమలు చేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు పీఎంవో
తెలిపింది.
కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ
దేశంలో కరోనా వ్యాప్తి సహా పలు అంశాలపై కాంగ్రెస్ ఎంపీలతో ఆ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగిన ఈ భేటీలో పార్టీ లోక్ సభ సభ్యులతో ఆమె మాట్లాడారు. పార్టీ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. వచ్చే పార్లమెంట్ సెషన్లో లేవనెత్తాల్సిన పలు అంశాలపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, లడఖ్ గొడవ లాంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ నిర్ణయించింది. పేదలకు ఫైనాన్సియల్ రిలీఫ్ ప్రకటించడంలో ప్రభుత్వ వైఖరి, పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలనూ పార్లమెంట్లో ప్రస్తావించాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిర్ణయించారు.
నియంత్రణ చర్యలు బాగున్నాయ్
ఢిల్లీలో కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్రాలతో పాటు లోకల్ అథారిటీల పనితీరు చాలా బాగుంది. ఎన్సీఆర్ ఏరియాలో వైరస్ వ్యాప్తిని అడ్డు కోవడానికి తీసుకున్న చర్యలను మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో కావాలి.
– ప్రధాని నరేంద్ర మోడీ
For More News..