సెలబ్రెటీలపేర్లతో క్రెడిట్ కార్డులు.. సైబర్ ముఠా అరెస్టు

సినీ స్టార్స్, క్రికెటర్ల లాంటి ప్రముఖులను మోసం చేసిన సైబర్ ముఠా కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. వారిలో ఎంఎస్ ధోనీ , అభిషేక్ బచ్చన్ , సోనమ్ కపూర్, సచిన్ టెండూల్కర్, సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్, అలియా భట్, శిల్పాశెట్టి వంటి 95 మంది ప్రముఖులు ఉండడం గమనార్హం. రూ.50 లక్షలకు పైగా మోసం చేసిన ఈ మోసగాళ్ల ముఠాలోని ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్టు డీసీపీ రోహిత్ మీనా తెలిపారు. అరెస్టయిన నిందితులు సుమారు 95 మంది ప్రముఖుల ప్రభుత్వ ఐడీలను నకిలీలుగా మార్చి, బ్యాంకులను కూడా రూ.50లక్షల వరకు మోసం చేశారని వెల్లడించారు.

జీఎస్టీ, పాన్ నంబర్లతో...

కొంతమంది బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్ల పాన్ కార్డు వివరాలను సైబర్ నేరగాళ్ల బృందం ఆన్ లైన్ లో పొందుపర్చిన జీఎస్టీ నంబర్లు, పాన్ కార్డు వివరాలను సేకరించారు. అనంతరం  పుణెకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డులను పొందారు. అలా మోసానికి గురైన వారిలో అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి, మాధురీ దీక్షిత్ , ఇమ్రాన్ హష్మీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ప్రముఖుల పేర్లు, వివరాలను కూడా నేరగాళ్లు ఉపయోగించారని షహద్ర రోహిత్ మీనా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) తెలిపారు. అయితే ఈ మోసానికి ముందు వారు రూ. 21.32 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశారన్నారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకున్నట్టు వెల్లడించారు. వారిలో పునీత్, మొహమ్మద్ ఆసిఫ్, సునీల్ కుమార్, పంకజ్ మిషార్, విశ్వ భాస్కర్ శర్మ అనే ఐదుగురు నిందితులు ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత ఆ ఐదుగురిని విచారించగా.. గూగూల్  నుండి ప్రముఖుల జీఎస్టీ వివరాలను పొందేవారమని తెలిపారు. జీఎస్టీఐఎన్  లోని మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్, తదుపరి 10 అంకెలు పాన్ నంబర్ అని వారికి బాగా తెలుసు. అందుకే వారికి మోసం చేయడం ఈజీగా మారిపోయిందని పోలీసులు స్పష్టం చేశారు.  ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతున్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేమని మీనా తెలిపారు. 

సెలబ్రిటీల పుట్టిన తేదీల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, దీంతో పాటు వారి పాన్ నెంబర్ల వివరాలను సేకరించారని, వీడియో వెరిఫికేషన్ సమయంలో నిందితులు పలనా సెలబ్రిటీ ఫొటోను పోలినట్టు ఉండే వ్యక్తితో వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసేవారని విచారణలో తేలింది. ఉదాహరణకు అభిషేక్ బచ్చన్ పాన్ కార్డులో ఉన్న ఫొటోకు ముఖం మ్యాచ్ అయ్యే వ్యక్తితో వెరిఫికేషన్ చేయించారు. ఈ ముఠా ఆధార్ కార్డ్ వివరాలను కూడా ఫోర్జరీ చేసినట్టు తేలింది. ఈ వివరాలన్నీ లభించిన తర్వాత క్రెడిట్ కార్డులకు అప్లై చేశారు. వీడియో వెరిఫికేషన్ సమయంలో వారి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే, అప్పటికే (CIBIL) సిబిల్ నుంచి సేకరించిన వివరాలు ఉండటంతో సులువుగా సమాధానం ఇచ్చారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తదుపరి విచారణ కొనసాగుతోంది. ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి క్రెడిట్‌ కార్డులు పొందేందుకు వారు ఇదే పద్ధతిని ఉపయోగించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మోసగాళ్లు పాన్, ఆధార్ నంబర్ వంటి వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా తమ యాప్ ద్వారా కంపెనీని సంప్రదించారని కంపెనీ వివరించింది. అందుకే వారి పేర్లపై క్రెడిట్ కార్డులు జారీ చేసినట్టు తెలిపింది. కంపెనీ చేసిన ఫిర్యాదు ప్రకారం, "ఒకే డివైజ్ ఉపయోగించి అనేక ఆన్- బోర్డింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని తమ సిస్టమ్‌కు హెచ్చరిక వచ్చింది. దాంతో తామ ఈ మోసం గురించి తెలుసుకున్నామని, నిందితులు ఏడు డివైజ్‌ల నుంచి 83 పాన్ వివరాలను ఉపయోగించి క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి ప్రయత్నించారని తెలిపారు. డాక్యుమెంట్‌లో ఉన్న అడ్రస్‌లకు ఫిజికల్ క్రెడిట్ కార్డులు కూడా పంపించామని వివరించింది.