- 100 కోట్ల సైబర్ స్కామ్.. చైనా వ్యక్తి అరెస్ట్
- వాట్సాప్‌లో ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం
- ట్రైనింగ్ సెషన్ల పేరుతో ఫేక్ కంపెనీల్లో పెట్టుబడి
- మొదట పలు అకౌంట్లకు డబ్బు ట్రాన్స్ ఫర్.. ఆ తర్వాత ఒకే ఖాతాలోకి..
- అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
- బాధితుల ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: రూ.100 కోట్ల సైబర్ స్కామ్ కేసులో చైనా వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను రూ.43.5 లక్షలు మోసపోయానని సురేశ్ కొలిచియిల్ అచ్యుతన్ అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టాక్ మార్కె ట్ ట్రైనింగ్ సెషన్ల పేరుతో ఫేక్ కంపెనీల్లో రూ. 43.5 లక్షలు పెట్టుబడి పెట్టించారని ఆరోపించాడు. ఆ డబ్బంతా నిందితులకు చెందిన పలు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదే తరహాలో సైబర్ క్రైమ్ పోర్టల్‌లో మరో17 ఫిర్యాదులను పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.100 కోట్ల మోసం జరిగినట్లు నిర్ధారించారు. ఈ కేసుల విచారణలోనే సంచలనాల విషయాలు బయటకొచ్చాయి. ఫ్రాడ్ ద్వారా పోయిన రూ.100 కోట్లు ఒకే బ్యాంక్ ఖాతాకు లింక్ అయినట్లు పోలీసులు కన్ఫాం చేసుకున్నారు. నేరంతో సంబంధం ఉన్న మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడు చైనా పౌరుడు ఫాంగ్ చిన్‌జిన్‌గా గుర్తించారు.
అతను వాట్సాప్‌లో ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరిట సైబర్ స్కామ్‌కు పాల్పడుతున్నట్లు తెలిపారు. ట్రైనింగ్ అని చెప్పి బాధితుల నుంచి డబ్బు తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకునేవాడని వెల్లడించారు. ఆ తర్వాత చెప్పాపెట్టకుండా కనిపించకుండా పోయేవాడన్నారు. ఏప్రిల్‌లో రూ.1.25 లక్షల బదిలీతో సహా పలు మోసపూరిత లావాదేవీలు జరిపినట్లు వివరించారు. అంతేగాక..ఏపీ, ఉత్తరప్రదేశ్‌లలో సైబర్ క్రైమ్, మనీలాండరింగ్‌కు సంబంధించిన మరో రెండు ముఖ్యమైన కేసులతోనూ ఫాంగ్ చిన్‌జిన్‌కు సంబంధం ఉందని విచారణలో వెల్లడైందన్నారు.
కాల్ రికార్డులు, బ్యాంకింగ్ డేటా ద్వారా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో నివాసిస్తున్న ఫాంగ్ చిన్జిన్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు.