పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు

పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు
  •  టార్గెట్ కాంగ్రెస్ సోషల్ మీడియా
  •  మఫ్టీలో తిరుగుతున్న రక్షక భటులు!
  •  కొత్త వారిపైనా కేసుల నమోదుకు చాన్స్
  •  ఇప్పటికే గీతకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు
  •  హాట్ టాపిక్ గా మారిన మొబైల్ స్వాధీనం
  •  బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
  •  హాట్ టాపిక్ గా ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ పోలీసులు ఎపిసోడ్

హైదరాబాద్: కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లే లక్ష్యంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ బస్తీల్లో ఆపరేషన్ చేపట్టారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో మరికొంత మందిని అరెస్టు చేసేందుకే వచ్చారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు నిన్న ఢిల్లీ పోలీసులు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఆమె మొబైల్ ఫోన్ సైతం స్వాధీనం చేసుకున్నారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో ఎడిటింగ్ గీతనే చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. 

అమిత్ షా ఫేక్ వీడియోషేర్ చేశారనే ఆరోపణపై సీఎం రేవంత్ రెడ్డితోపాటు సోషల్ మీడియా ఇన్ చార్జి మన్నె సతీశ్, నవీన్, తస్లీమాకు గత నెల 29న గాంధీభవన్ లో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తన న్యాయవాది సౌమ్య ద్వారా సమాధానం పంపించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా ఉన్నానని, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున నాలుగు వారాల గడువు కావాలని కోరారు. సోషల్ మీడియా వారియర్లు కూడా పదిహేను రోజుల తర్వాతే విచారణకు హాజరవుతారని వివరించారు.

 అయితే ఇవాళ ఉదయం ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లే లక్ష్యంగా ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారని సమాచారం. తొలుత  ముగ్గురు సోషల్ మీడియా వారియర్లకే నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు తర్వాత గీతకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అమిత్ షా వీడియోను ఆమెనే ఎడిట్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

 అయితే ఇంకా ఎంత మందిని టార్గెట్ గా చేసుకొని అరెస్టులు చేస్తారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదిలా ఉండగా  అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లు మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను హైదరాబాద్ లోని సైబర్  క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం కన్నా ముందే హైదరాబాద్ లో కేసు నమోదైందని చెబుతున్నారు.

 ఈ మేరకు వారిని సీసీఎస్ కు తరలించారు. వారిని జడ్జి ఎదుట హాజరు పర్చనున్నారు. ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెయిల్ ఇస్తారా..? లేక రిమాండ్ కు పంపుతారా..? సైబర్ క్రైం పోలీసులు కస్టడీలో ఉన్న వీరిపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.