వీడియో మార్ఫింగ్ కేసులో.. ఢిల్లీ పోలీస్‌‌ వర్సెస్‌‌ తెలంగాణ పోలీస్

వీడియో మార్ఫింగ్ కేసులో.. ఢిల్లీ పోలీస్‌‌ వర్సెస్‌‌ తెలంగాణ పోలీస్
  • నిందితులను అరెస్ట్ చేసేందుకు గాంధీభవన్​కు ఢిల్లీ పోలీసులు
  • వారి కంటే ముందే అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు
  • శుక్రవారం కోర్టులో హాజరుపర్చేందుకు ఏర్పాట్లు 
  • ఊహించని పరిణామంతో కంగుతిన్న ఢిల్లీ పోలీసులు 
  • నిందితులను ఎలా అరెస్ట్ చేయాలనేదానిపై మల్లగుల్లాలు 

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా వీడియో మార్ఫింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు గాంధీభవన్​కు చేరుకోగా.. వారిని అంతకుముందే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేసులో హైడ్రామా మొదలైంది. కాంగ్రెస్​ సోషల్​మీడియా వారియర్స్ ఇన్​చార్జి మన్నె సతీశ్, కన్వీనర్‌‌ నవీన్‌‌, గ్రూప్‌‌ ప్రతినిధులు తస్లిమా, గీత, శివను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న సిటీ సెంట్రల్ క్రైమ్‌‌ స్టేషన్‌‌(సీసీఎస్) పోలీసులు వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో ఢిల్లీ పోలీసులు బిత్తరపోయారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఏం చేయాలనేదానిపై మల్లగుల్లాలు పడ్తున్నారు.  

సీసీఎస్‌‌లో నమోదైన కేసులో అరెస్ట్ 

రిజర్వేషన్లపై అమిత్‌‌షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి ఎక్స్‌‌(ట్విట్టర్‌‌‌‌)లో వైరల్‌‌ చేశారనే ఆరోపణలతో టీపీసీసీ సోషల్‌‌ మీడియా వారియర్స్‌‌పై ఢిల్లీతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్‌‌ రెడ్డి ఫిర్యాదు మేరకు గత నెల 27న సీసీఎస్ పోలీసులు ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు.‌‌ అయితే, ఢిల్లీలో నమోదైన కేసులకు సంబంధించి మే1న విచారణకు రావాలని అక్కడి స్పెషల్‌‌ సెల్‌‌ పోలీసులు గత సోమవారం సీఎం రేవంత్​రెడ్డితో పాటు మన్నె సతీశ్​సహా ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. 

అమిత్‌‌షా వీడియోను ఎడిట్‌‌ చేసి ట్విట్టర్‌‌‌‌లో పోస్ట్‌‌ చేసినట్లు అనుమానిస్తున్న గీతకు ఇప్పటికే 41ఏ సీఆర్‌‌‌‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఉదయం ఢిల్లీ స్పెషల్ సెల్‌‌ ఇన్‌‌స్పెక్టర్‌‌ రామ్‌‌ విలాస్ సహా నలుగురు కానిస్టేబుల్స్‌‌‌‌ మరోసారి హైదరాబాద్‌‌కు వచ్చారు. సోషల్ మీడియా వారియర్స్‌‌ కోసం గాంధీభవన్‌‌లో ఆరా తీశారు. విషయం తెలుసుకున్న బేగంబజార్ ఇన్‌‌స్పెక్టర్ విజయ్‌‌కుమార్‌‌ గాంధీభవన్‌‌ కు చేరుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ కోసం వెతుకుతున్నారని తెలుసుకుని.. పార్టీ లీగల్‌‌ సెల్‌‌ అడ్వకేట్‌‌ రామచంద్రారెడ్డిని కలవాలని సూచించడంతో ఢిల్లీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

కోర్టుకెళ్లే యోచనలో ఢిల్లీ పోలీసులు 

కాంగ్రెస్ సోషల్‌‌మీడియా వారియర్స్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు వచ్చిన విషయం తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మన్నె సతీశ్, గ్రూప్‌‌ ప్రతినిధులు అస్మా, తస్లిమా, నవీన్‌‌, గీత, శివను తమ అదుపులోకి తీసుకొని బషీర్‌‌‌‌బాగ్‌‌లోని సీసీఎస్‌‌కు తరలించారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు చిక్కులు ఎదురయ్యాయి. నిందితులను అరెస్ట్ చేసేందుకు బషీర్‌‌‌‌బాగ్‌‌లోని సీసీఎస్‌‌ చుట్టూ తిరిగారు. కానీ ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉండటంతో వారిని అరెస్ట్‌‌ చేసే అవకాశం లేక ఉన్నతాధికారులను సంప్రదించారు. నిందితులను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు ద్వారా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.