అమల్లోకి మూడు కొత్త చట్టాలు.. మొదటి కేసు నమోదు

అమల్లోకి మూడు కొత్త చట్టాలు.. మొదటి కేసు నమోదు

దేశంలో బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో మొదటి కేసు నమోదు అయ్యింది. ఈ కొత్త చట్టాల ప్రకారం.. 2024, జూలై 1 ఢిల్లీ పోలీసులు మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఢిల్లీలోని కమలా నగర్ పోలీస్ స్టేషన్‌లో వీధి వ్యాపారిపై భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 285 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్‌బ్రిడ్జి కింద.. వీధి వ్యాపారి విక్రయాలు జరుపుతూ వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులకు కలిగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

"అర్థరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో.. రైల్వే స్టేషన్ సమీపంలో మార్గమధ్యలో ఓ చిన్న బండిపై విక్రయాలు జరుపుతున్న వ్యక్తిని పోలీసులు చూసి.. ఇది వాహనాదారులకు ఇబ్బంది కలిగిస్తుందని.. ఇక్కడి నుంచి తరలించాలని పలుమార్లు చెప్పారు. అయినా.. అతను పోలీసులను పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు..విక్రయాలు జరుపుతున్న వ్యక్తి వివరాలు సేకరించి.. కొత్త చట్టం, BNS సెక్షన్ 285 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చేశారు” అని ఎఫ్‌ఐఆర్ కాపీలో తెలిపారు.

కాగా, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్​ సురక్ష సంహిత చట్టాన్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష్యా అధినియం చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది.