- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విద్యార్థి తండ్రి, ప్రిన్సిపాల్ ఆడియో సంభాషణ
జీడిమెట్ల, వెలుగు: అయ్యప్ప మాల ధరించిన ఓ విద్యార్థిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించడం వివాదాస్పదంగా మారింది. స్కూల్ ప్రిన్సిపల్, విద్యార్థి తండ్రి మధ్య జరిగిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కుషాల్బాలాజీ గ్రేడ్1 చదువుతున్నాడు. అయ్యప్ప మాలతో బుధవారం స్కూల్‌కు వెళ్లడంతో యాజమాన్యం బాలుడిని క్లాస్‌రూంలో కూర్చోబెట్టకుండా, వేరుగా లైబ్రరీలో కూర్చోబెట్టి విద్యార్థి తండ్రికి కాల్ చేసింది. స్కూల్‌కు పిల్లలను మాలలో పంపొద్దని సర్క్యూలర్ జారీ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు.
తనకు సర్క్యూలర్ రాలేదని, లేదంటే పంపేవాడిని కాదని బాలుడి తండ్రి సమాధానం ఇచ్చారు. దీంతో బాబును ఇప్పుడే వచ్చి తీసుకెళ్లాలని చెప్పగా, తాను ఆఫీస్‌లో ఉన్నానని బస్‌లో పంపండని కోరారు. అయితే, పిల్లాడిని సపరేట్గా లైబ్రరీలో కూర్చోబెట్టామని, ఎగ్జామ్ అక్కడే కండక్ట్ చేసి సాయంత్రం పంపిస్తానని చెప్పారు. దీంతో విద్యార్థి తండ్రి ఒక్కసారిగా ఆవేదనకు గురై.. క్లాస్‌లో కూర్చోబెట్టాలని, లేదంటే తన బాబు అవమానంగా భావిస్తాడని కోరాడు. ఎంత చెప్పినా ప్రిన్సిపల్ పిల్లాడిని తీసుకెళ్లాలని చెప్పడంతో విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తండ్రి మాట పట్టించుకోని పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ఇంటికి పంపించి వేసింది. ఈ ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది.