ఢిల్లీలో కుండపోత.. 88 ఏండ్లలోనే అత్యధిక వాన

ఢిల్లీలో కుండపోత.. 88 ఏండ్లలోనే అత్యధిక వాన
  •     లోతట్టు ప్రాంతాలు జలమయం
  •     పలుచోట్ల ట్రాఫిక్ జామ్​.. వాహనదారులకు ఇబ్బందులు
  •     కరెంట్ సప్లై ఆపేసిన అధికారులు
  •     సబ్ వేల్లో 4 అడుగుల మేర నిలిచిన నీళ్లు 

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. గురువారం పొద్దున 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు గ్యాప్ లేకుండా వాన దంచికొట్టింది. 24 గంటల వ్యవధిలో 22.8‌‌‌‌‌‌‌‌0‌‌‌‌‌‌‌‌ సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 88 ఏండ్ల తర్వాత ఈ స్థాయిలో వాన పడటం ఇదే ఫస్ట్​ టైమ్ అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1936 జూన్ 28న (సరిగ్గా 88 ఏండ్ల కింద ఇదే రోజు) 23.5 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయినట్టు వివరించారు. ఢిల్లీ – ఎన్సీఆర్ వ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించాయని తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల మధ్యలోనే రికార్డు స్థాయిలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వివరించారు. ఢిల్లీలో జూన్ నెలలో కురిసిన వర్షాల్లో ఇది సరికొత్త రికార్డు అని చెప్పారు. కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సబ్ వేలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్య, భారీ వర్షం కారణంగా చాలా చోట్ల కరెంట్ సప్లై నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ద్వారకా, జంగ్​పురా, లక్ష్మీనగర్ వాసులు తీవ్రంగా ప్రభావితం అయ్యారు. పార్లమెంట్​కు వెళ్లేందుకు ఎంపీలు నానా తంటాలు పడ్డారు. సమాజ్‌‌‌‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌‌‌‌ గోపాల్ యాదవ్‌‌‌‌ ఇంటిచుట్టూ మోకాల్లోతు నీరు నిల్వడంతో సిబ్బంది ఆయన్ను ఎత్తుకుని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, వర్షాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. సెలవుల్లో ఉన్నవాళ్లందరూ వెంటనే డ్యూటీకి వచ్చేయాలని ఆదేశించారు. 2 నెలల వరకు సెలవులు ఉండవన్నారు.

చెరువులను తలపించిన మెయిన్ రోడ్లు

కొన్నిచోట్ల చెట్లు విరిగిపడటంతో కార్లు, బైక్​లు ధ్వంసమయ్యాయి. మెయిన్ రోడ్లు మోకాల్లోతు నీటితో చెరువులను తలపించాయి. ఆప్ మంత్రి ఆతిశీ ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి. మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, మరో ఇద్దరు మినిస్టర్లు, అధికారులు కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ క్లియర్​ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీటిని తోడేయాలని మంత్రి భరద్వాజ్ సూచించారు.

జంక్షన్లు అన్నీ జామ్

కుండపోత వర్షానికి మండి హౌస్​కు వెళ్లే హనుమాన్ టెంపుల్ చౌరస్తా నీట మునిగింది. అశోకా రోడ్, ఫిరోజ్​షా రోడ్, కన్నాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. ఢిల్లీలోని మూల్​చంద్​తో పాటు పలు ప్రాంతాల్లోని సబ్ వేల్లో 4 అడుగుల మేర నీరు నిలిచింది. నోయిడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మహామాయ ఫ్లై ఓవర్, సెక్టార్ 62, సెక్టార్ 15, 16 నీట మునిగాయి. వర్షాలపై ముందస్తు సమాచారంతో అన్ని విధాలుగా రెడీ అయ్యామని ఢిల్లీ మేయర్ షెల్లీ ఓబెరాయ్ తెలిపారు. 

ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు 

న్యూఢిల్లీ: భారీ వర్షానికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినల్–1 పైకప్పులో కొంతభాగం కూలింది. ఈ ఘటనలో ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన క్యాబ్ డ్రైవర్ రమేశ్ కుమార్(45) చనిపోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ‘‘భారీ వర్షానికి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో టెర్మినల్ పైకప్పులోని కొంతభాగం 
కుప్పకూలింది. రూఫ్ షీట్, దానికి సపోర్టుగా ఉంచిన ఐరన్ బీమ్స్ కిందపడ్డాయి. దీంతో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. అందులో ఓ కారులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడాం. గాయపడిన ఆరుగురిని హాస్పిటల్​కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాలను తొలగిస్తున్నాం” అని డీసీపీ ఉష తెలిపారు. ప్రమాదం కారణంగా టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులను బంద్ చేస్తున్నట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.