ఢిల్లీలో భూకంపం.. కొన్ని సెకన్లపాటు వినిపించిన పెద్ద శబ్దం.. భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

ఢిల్లీలో భూకంపం.. కొన్ని సెకన్లపాటు వినిపించిన పెద్ద శబ్దం.. భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

 

  • రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.0గా నమోదు
  • ధౌలా కాన్‌లో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
  • సోషల్​ మీడియాలో సీసీటీవీ ఫుటేజీలు వైరల్​
  • అలర్ట్​గా ఉండాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటలకు కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్​​ప్రాంతాల్లో భూప్రకంపనాలు సంభవించాయి. రిక్టర్​ స్కేల్​పై 4.0 తీవ్రత నమోదైందని, ధౌలాకాన్​లోని దుర్గాబాయ్​ దేశ్​ముఖ్​ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించామని ‘నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మాలజీ’ అధికారులు వెల్లడించారు.  ఈ భూకంప సమయంలో కొన్ని సెకన్లపాటు ‘బూమ్’ అనే శబ్దం వినిపించడంతో ప్రజలు వణికిపోయారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇండ్లనుంచి పరుగులు పెట్టిన ప్రజలు

భూ ప్రకంపనలు, భారీ శబ్దంతో ఢిల్లీ ప్రజలు వణికిపోయారు. ఒక్కసారిగా ఇండ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇందులో ఇండ్లు, పెద్దపెద్ద బిల్డింగ్​లు, విద్యుత్​స్తంభాలు, ఫ్యాన్లు, సోలార్ ​ప్యానెల్స్​ ఊగిపోతున్నట్టు కనిపించాయి. 5 నుంచి 8 సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భూకంపం ధాటికి ట్రాక్​పై వెళ్తున్న రైలుసహా వాహనాలు, బిల్డింగ్​లు కొన్ని సెకన్లపాటు ఊగడం కనిపించిందని తెలిపారు. తాము భయాందోళనలకు గురయ్యామని, ఇండ్ల నుంటి రోడ్లపైకి వచ్చేశామని చెప్పారు. ఇంత తీవ్రమైన భూకంపాన్ని తాము గతంలో చూడలేదని తెలిపారు. కాగా, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే 112 కు కాల్​ చేయాలని పోలీసులు ఎక్స్​ (ట్విట్టర్) వేదికగా ప్రజలకు సూచించారు. తాము అనుక్షణం అప్రమత్తంగా ఉంటామని వెల్లడించారు.

భారీ శబ్దం ఎందుకంటే?

భూకంపం సంభవించినప్పుడు వినిపించిన భారీ శబ్దానికి గల కారణాలను జియోలాజికల్‌‌‌‌ సర్వే అధికారులు వివరించారు. తక్కువ లోతులో భూకంప కేంద్రం ఏర్పడితే ప్రకంపన సమయంలో ఈ శబ్దాలు వినిపిస్తుంటాయని తెలిపారు. ఆ సమయంలో భూమిపై ప్రకంపనలు రావడంతోపాటు, స్వల్పకాలం వచ్చిన భూతరంగాలు గాలిలో కలిసి ధ్వని తరంగాలుగా ఏర్పడతాయని వివరించారు. హై ఫ్రీక్వెన్సీ కంపనాల వల్ల బూమ్​ అనే శబ్దం వస్తుందని వెల్లడించారు.  కేంద్రం లోతు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువగా శబ్దాలు వస్తాయని తెలిపారు. 

మరోసారి వచ్చే చాన్స్:  ప్రధాని మోదీ

మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురవకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. అందరూ తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు. కాగా, ఢిల్లీ తాత్కాలిక సీఎం ఆతిశి  మాట్లాడుతూ, ‘‘ఢిల్లీలో ఇప్పుడే బలమైన భూకంపం సంభవించింది. అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా” అని తెలిపారు.