న్యూఢిల్లీ: గతేడాది దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలు హింసాత్మక మలుపు తీసుకోవడం, ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 50 మంది మరణించగా.. దాదాపు 200 మంది గాయపడ్డారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు ఇబ్రహీం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నిందితుడు ఇబ్రహీంతోపాటు పలువురు కత్తులు, కర్రలతో తిరుగుతూ హల్‌చల్ చేసిన వీడియోలు పలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యిందని కోర్టు పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారమే అల్లర్లు సృష్టించారని, నిందితుడికి బెయిల్ ఇవ్వడం అస్సలు కుదరని కోర్టు స్పష్టం చేసింది. ‘సిటీలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించాలని ముందస్తు ప్లాన్‌తో చేసిన కుట్ర ఇది. ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుకుట్ట వేయడంతోపాటు సామాన్యులను తీవ్ర భయాందోళనలకు గురి చేసిన చర్య ఇది’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన జరిగిన ప్రాంతంలో ఓ వ్యూహం ప్రకారం సీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేసి వాటిని ధ్వంసం చేశారని కోర్టు మండిపడింది. పోలీసు అధికారుల మీద కర్రలు, బ్యాట్లతో నిందితులు అమానుషంగా దాడికి దిగారని స్పష్టం చేసింది.