- సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా
- లిక్కర్ స్కామ్ నిందితుల తరఫు అడ్వకేట్లకు అందని కాపీలు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్ షీట్ కాపీలు, అనువాద పత్రాలు నిందితుల తరఫు అడ్వకేట్లకు అందకపోవడంతో విచారణ వాయిదా వేస్తున్నట్లు ట్రయల్ కోర్టు వెల్లడించింది. ఈ కేసు వ్యవహారంలో జూన్ 7న కవితతో పాటు, మరో నలుగురిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్ ను జులై 22న కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. అలాగే, అంతకు ముందు మనీశ్ సిసోడియా, అమన్ దీప్ దళ్, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రుపై సీబీఐ అదనపు చార్జ్‌షీట్ వేసింది. ఈ చార్జ్షీట్లపై బుధవారం సీబీఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా కవితతో పాటు, సహ నిందితులను తిహార్ జైలు అధికారులు వర్చువల్ మోడ్ లో కోర్టు ముందు హాజరుపరిచారు. కవిత తరఫు అడ్వకేట్ నితీష్ రాణా వాదనలు వినిపిస్తూ.. సీబీఐ చార్జ్ షీట్ కాపీలు తమకు అందలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీబీఐ తరఫు అడ్వకేట్ జోక్యం చేసుకొని.. చార్జ్ షీట్ పేజినేషన్ పూర్తిచేశామని తెలిపారు. నిందితుల అడ్వకేట్లకు మంగళవారం సాయంత్రమే కాపీలు అందజేసినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన స్పెషల్ జడ్జి.. సీబీఐ తరఫు న్యాయవాదికి ఈ–మెయిల్ ఐడీ ఇవ్వాలని కవిత అడ్వకేట్లకు సూచించారు. నిందితుల తరఫు న్యాయవాదులకు వెంటనే చార్జ్ షీట్ కాపీలు ఈ–మెయిల్ చేస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. స్పెషల్ జడ్జి.. నిందితుల తరఫు అడ్వకేట్లకు రెండు రోజుల్లో పూర్తి స్థాయి చార్జ్ షీట్ కాపీలు, అనువాద పత్రాలు అందజేయాలని సీబీఐని ఆదేశించారు.