ఈ అమ్మాయిని చంపింది డెలివరీ బాయ్.. చుట్టమే అయినా

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా యువతిని దారుణంగా హతమార్చాడు ఓ  దుండగుడు. పార్క్‌లో బెంచ్‌పై కూర్చున్న యువతి తలపై ఇనుప రాడ్డుతో అతి కిరాతకంగా కొట్టి చంపాడు. ఈ ఘటన ఢిల్లీలోని మాలవీయనగర్ శివాలిక్‌లోని విజయ్ మండల్ పార్క్‌లో చోటు చేసుకుంది.

పెళ్ళికి ఒప్పుకోలేదని.. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఇర్ఫాన్ (28) డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. అతనికి బంధువైన యువతి(25) నగరంలోని కమలా నెహ్రూ కాలేజీలో చదువుతోంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధించేవాడు ఇర్ఫాన్​. ఈ విషయాన్ని యువతి ఇంట్లో చెప్పగా.. వారు అందుకు అంగీకరించలేదు. ఉద్యోగం లేదన్న కారణంతో అతనితో పెళ్లికి నిరాకరించారు. 

ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అరబిందో కాలేజీ సమీపంలోని పార్కుకు వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ, నిందితుడు పక్కనున్న ఇనుప రాడ్‌ తీసుకొని యువతి తలపై బలంగా మోదాడు. దీంతో ఆ విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పెళ్ళికి అంగీకరించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.