శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు కర్ఫ్యూ

కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం రాత్రి పదిగంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. అయితే ప్రజా రవాణాపై ఆంక్షల్లో కూడా మార్పులు చేశారు. బస్సులు, మెట్రోలు పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సామర్థ్యంతో ఉద్యోగులు హాజరు కావాలని తెలిపారు.

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు వరుసగా రెండు రోజుల పాటు ఐదు శాతం కంటే ఎక్కువగా నమోదు కావడంతో యాక్షన్ ప్లాన్ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పాటిటివిటీ రేటు 6.46 శాతంగా ఉంది. ప్రతి 100 టెస్టుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం నివేదించింది. సోమవారం 24 గంటల్లో 4,099 కొత్త కేసులు, ఒక మరణం నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. జనవరి నెల సగం నాటికి ఢిల్లీలో రోజుకు 20 నుంచి 25 వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

ఢిల్లీలో ఇప్పటికే రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. సినిమా హాళ్లు, జిమ్‌లు మూసివేయబడ్డాయి. అదేవిధంగా దుకాణాలు బేసి-సరి ప్రాతిపదికన  అనుమతించబడుతున్నాయి.

For More News..

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

కానిస్టేబుల్ విధులు కూడా సీపీనే చేశారు

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

ఇద్దరు బీజేపీ ఎంపీలకు కరోనా పాజిటివ్