హైదరాబాద్లో బైక్ నడిపేటోళ్లు జర జాగ్రత్త.. ఈ ఒక్క తప్పు వల్ల ఢిల్లీలో 2.7 లక్షల ఛలాన్లు పడ్డాయి..!

హైదరాబాద్లో బైక్ నడిపేటోళ్లు జర జాగ్రత్త.. ఈ ఒక్క తప్పు వల్ల ఢిల్లీలో 2.7 లక్షల ఛలాన్లు పడ్డాయి..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ తాజాగా బయటపెట్టిన డేటాలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొల్యూషన్ అండర్ కంట్రోల్(PUC) సర్టిఫికెట్.. అదేనండి పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల 2024, జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకూ ఢిల్లీ నగరంలో 2.7 లక్షల ఛలాన్లు విధించినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అసలే.. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీని ఈ వార్త మరింత బెంబేలెత్తిస్తోంది. ఈ స్థాయిలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా 4 వీలర్, 2 వీలర్ వాహనదారులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడేళ్లతో పోల్చితే ఈ సంఖ్య అత్యధికం అని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

పొల్యూషన్ సర్టిఫికెట్ లేని కారణంగా 2023లో 2,32,885 ఛలాన్లు, 2022లో 1,64,638 ఛలాన్లు విధించినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే వాహనదారులు మాత్రం కాలుష్యం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా ప్రవర్తించడం విస్మయానికి గురిచేస్తోంది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం.

ALSO READ | హైదరాబాద్లో ఇలా చేస్తున్న కోచింగ్ సెంటర్లకు ఇక మూడినట్టే..!

హైదరాబాద్ నగరంలో కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా పలువురు వాహనదారులు ఇష్టారాజ్యంగా గాలిని కలుషితం చేస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం మిగిల్చిన దుష్ప్రభావాన్ని చూసైనా హైదరాబాద్ నగరంలోని కొందరు వాహనదారులు తీరు మార్చుకుని కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించాలనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. 

ఢిల్లీలో గాలి కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఎయిర్ క్వాలిటీ దెబ్బతినడంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఢిల్లీ–ఎన్​సీఆర్ పరిధిలో ఉన్న 69 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు గొంతు నొప్పి, తీవ్ర దగ్గు, కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 నుంచి 500 రేంజ్​లో ఉన్నది. రానున్న మరికొన్ని వారాల్లో ఇది రెట్టింపు అయ్యే ప్రమాదం పొంచి ఉంది.