SMAT: టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. ఒకే జట్టులో బౌలింగ్ వేసిన 11 మంది ఆటగాళ్లు

SMAT: టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర.. ఒకే జట్టులో బౌలింగ్ వేసిన 11 మంది ఆటగాళ్లు

టీ20 క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూడని రికార్డ్ ఒకటి నమోదయింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో మణిపూర్‌తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 11 మందితో బౌలింగ్ చేయించింది. ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బడోనీ మొత్తం 11 మందికి బౌలింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో ఒక టీ20 మ్యాచ్ లో తొలిసారి జట్టులోని 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేసిన రికార్డ్ ఢిల్లీ నెలకొల్పింది. అంతకముందు టీ20 చరిత్రలో అత్యధికంగా 9 మంది బౌలింగ్ చేయగా.. శుక్రవారం (నవంబర్ 29) ఢిల్లీ ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. 

ఢిల్లీ వికెట్ కీపర్ అనుజ్ రావత్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి 14 పరుగులు ఇచ్చాడు. భారత టెస్ట్ క్రికెట్ లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో వెస్టిండీస్ పై టీమిండియాలో 11 మంది బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మణిపూర్‌ 20 ఓవర్లలో 120 పరుగులకు పరిమితమైంది. ఒకదశలో మణిపూర్‌ 6 వికెట్లకు 41 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో ఉండడంతో బడోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

ఢిల్లీ తరఫున హర్ష్ త్యాగి, దిగ్వేష్ రాఠీ చెరో రెండు వికెట్లతో రాణించారు. 121 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. ఇదిలా ఉండగా.. మణిపూర్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 11 మందితో బౌలింగ్ చేయించినందుకు భారత మాజీ పేసర్ దొడ్డా గణేష్ ఢిల్లీపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇది ప్రొఫెషనల్ క్రికెట్‌ను అపహాస్యం చేయడం లాటిందని.. ఢిల్లీకి అలా చేయాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించాడు.