ఢిల్లీ ఓటర్లు ఎంత మందో తెలుసా.. వెయ్యి దాటిన ట్రాన్స్ జెండర్ ఓట్లు

ఢిల్లీ ఓటర్లు ఎంత మందో తెలుసా.. వెయ్యి దాటిన ట్రాన్స్ జెండర్ ఓట్లు

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీ ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో 83,49,645 మంది పురుష ఓటర్లు.. 71,73,952 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 1,261 మంది ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఈ మేరకు 2025, జనవరి 6వ తేదీన ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో కంటే ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈసీ పేర్కొంది. 52, 554 మంది మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని తెలిపింది.

 ఓటరు గుర్తింపు కోసం తప్పుడు పత్రాలు సమర్పించినందుకు ఇప్పటివరకు 24 మందిపై ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని ఈసీ వెల్లడించింది.  కొత్త ఓటరు కార్డు పొందడానికి తప్పుడు, కల్పిత పత్రాలను సమర్పించకుండా ఈ సందర్భంగా ఈసీ హెచ్చరింది. కాగా, 2025, ఫిబ్రవరి 15వ తేదీతో ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ లోపే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 7 లేదా 8వ తేదీల్లో ఈసీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆప్.. ఎలాగైనా దేశ రాజధానిలో పాగా వేయాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు  చేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా.. ఆప్ ఇప్పటికే అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం హోరెత్తిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే కొన్ని స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేసి.. మిగిలిన సీట్ల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగుతున్నారు.