ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు

ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు
  • ఎయిర్​పోర్టు వద్ద విజిబిలిటీ లెవల్ జీరో
  • 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా రైళ్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పేసింది. దీంతో విజిబిలిటీ లెవల్ జీరోకి పడిపోయింది. టెంపరేచర్లు కూడా దారుణంగా దిగజారాయి. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు చుట్టూ దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో సుమారు 200కుపైగా విమానాలు, పదుల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మధ్యాహ్నం దాటినా పొగ మంచు తీవ్రత తగ్గలేదు. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు నమోదైంది.

 ఇది సాధారణంగా కంటే 3 డిగ్రీలు తక్కువ అని ఐఎండీ పేర్కొన్నది. కనిష్టంగా 6 డిగ్రీల వరకు ఢిల్లీ టెంపరేచర్ పడిపోయింది. సోమవారం మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీలోని పాలెం ఎయిర్​పోర్టు వద్ద పొద్దున 8 గంటలకు విజిబిలిటీ లెవల్ 0 మీటర్లుగా నమోదైంది. సఫ్దార్​జంగ్ వద్ద 50 మీటర్లుగా రికార్డు అయింది. పాలెం, ఇందిరా గాంధీ ఎయిర్​పోర్టు నుంచి కమర్షియల్ విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. స్పైస్​జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియాతో పాటు మరికొన్ని ఎయిర్​లైన్స్ సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన విమానాలు యావరేజ్​గా 6 నిమిషాలు, ఢిల్లీ నుంచి బయల్దేరే ఫ్లైట్​లు యావరేజ్​గా 47 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్​లైన్స్ సంస్థలు

పొగ మంచు కారణంగా ల్యాండింగ్, టేకాఫ్ విషయంలో పైలెట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు లిమిటెడ్ తెలిపింది. ఒక రోజులో ఢిల్లీ ఎయిర్​పోర్టుకు సుమారు 1,300 విమానాలు వస్తూపోతుంటాయి. పొగ మంచు కారణంగా అమృత్​సర్, గువాహటి విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు స్పైస్​జెట్ ప్రకటించింది. ఢిల్లీ, అమృత్​సర్, లక్నో, బెంగళూరు, గువాహటి వెళ్లే విమానాలకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసినట్లు ఇండిగో ఎయిర్​లైన్స్ ప్రకటించింది. ఢిల్లీ నుంచి రాకపోకలకు ప్లాన్ చేసేవాళ్లు టైమ్ టేబుల్​ను చెక్ చేసుకోవాలని ఎయిర్​లైన్స్ సంస్థలు ప్రకటించాయి. జీరో విజిబిలిటీ రికార్డ్ అయితే.. ఫ్లైట్లు రద్దు కూడా చేస్తామని వెల్లడించాయి. అదేవిధంగా, ఢిల్లీ నుంచి బయల్దేరాల్సిన 24 ట్రైన్లు ఆలస్యంగా నడిచాయి. అయోధ్య ఎక్స్​ప్రెస్ 4 గంటలు, గోరఖ్​ధామ్ ఎక్స్​ప్రెస్ 2 గంటలు, బీహార్ క్రాంతి, శ్రమ్​శక్తి ఎక్స్​ప్రెస్ ట్రైన్లు 3 గంటలకు పైగా లేట్​గా నడిచాయి. కాగా, ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ‘వెరీ పూర్’ కేటగిరిలోనే నమోదైంది. లోధి రోడ్​లో ఏక్యూఐ 309గా రికార్డ్ అయింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్​ప్రదేశ్, లడఖ్, జమ్మూ కాశ్మీర్​లనూ పొగ మంచు కప్పేసింది.