ఢిల్లీలో అమానుషం జరిగింది. మద్యం మత్తులో ఉన్న పలువురు యువకులు.. కారును ఇష్టానుసారంగా డ్రైవ్ చేశారు. 23 ఏళ్ల యువతి నడుపుతున్న స్కూటీని ఢీకొట్టి.. స్పృహ కూడా లేని విధంగా ఆమెను తమ కారుతో పాటు దాదాపు 4 కిలోమీటర్లు (సుల్తాన్ పురి నుంచి కాన్ ఝ్వాలా వరకు) లాక్కెళ్లారు. దీంతో ఆ యువతి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. నగ్నావస్థలో రోడ్డుపై పడిపోయింది. ఆదివారం వేకువజామున.. నూతన సంవత్సరంలోకి అడుగిడిన తొలి గంటల్లో ఈ అమానుష ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు.
3.30 గంటలకు ఫోన్ కాల్..
ఆదివారం వేకువజామున దాదాపు 3.30 గంటల సమయంలో కాన్ ఝ్వాలా పోలీసు స్టేషన్ కు ఒక కాల్ వచ్చింది. గ్రే కలర్ బాలెనో కారు కుతుబ్ ఘర్ వైపుగా ఒక యువతిని ఈడ్చుకుపోతోందని కాల్ చేసిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ కారు రిజిస్ట్రేషన్ నంబరును కూడా ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ ఏరియాలోని పోలీస్ చెక్ పాయింట్లకు అన్నింటికి సమాచారాన్ని పంపించారు. ఆ నంబరు కారు వస్తే ఆపాలని ఆదేశాలు జారీ చేశారు.
అరగంట తర్వాత మరో కాల్..
ఈక్రమంలో అర గంట తర్వాత (వేకువజామున 4 గంటలకు) కాన్ ఝ్వాలా పోలీసు స్టేషన్ కు మరో ఫోన్ కాల్ వచ్చింది. ఆ కారు ఈడ్చుకుపోయిన యువతి మృతదేహం స్థానికంగా రోడ్డుపై పడి ఉందని ఫోన్ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసుల క్రైమ్ బ్రాంచ్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలను సేకరించింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఢిల్లీలోని మంగోల్ పురి ప్రాంతంలో ఉన్న ఎస్జీఎం హాస్పిటల్ కు తరలించారు.
కారు సీజ్.. ఐదుగురు అరెస్టు
మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడిన కారు ఓనరు వివరాలను పోలీసులు గుర్తించి.. అందులో ప్రయాణించినట్లుగా భావిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. దీపక్ ఖన్నా (26), అమిత్ ఖన్నా (25), క్రిషన్ (27), మిథున్ (26), మనోజ్ మిట్టల్ (27) లను నిందితులుగా గుర్తించారు. వారు నడిపిన కారును పోలీసులు సీజ్ చేశారు.
ఫంక్షన్ లో పనిచేసి ఇంటికి వెళ్తుండగా..
ఇక మృతిచెందిన యువతి స్కూటీని సుల్తాన్ పురి పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఇవాళ వేకువజామున 3 గంటల 53 నిమిషాలకు గుర్తించారు. మృతిచెందిన యువతి పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పార్ట్ టైం వర్క్స్ చేస్తోందని పోలీసులు తెలిపారు. ఆదివారం ఒక ఫంక్షన్ లో పనిచేసి స్కూటీపై ఆమె ఇంటికి బయలుదేరగా ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.