ఢిల్లీలో మరో విషాదం.. తల్లీకొడుకు మృతి

 ఢిల్లీలో మరో విషాదం.. తల్లీకొడుకు మృతి

వరదల వల్ల కోచింగ్ సెంటర్ లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందిన ఘటన మరవక ముందే ఢిల్లీలో మరో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భారీ వరదలతో నిన్నసాయంత్రం ఓ తల్లీకొడుకు మురికి కాలువలో పడి మరణించారు. తనూజా బిష్త్ అనే మహిళ తన మూడేళ్ల కొడుకు ప్రియాంష్‌తో కలిసి ఘాజీపూర్‌లోని వీక్లీ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం పడింది. 

ఈ క్రమంలో రోడ్డు నీటమునగడంతో దారి తెలియక తనూజ తన కొడుకుతో కలిసి మురికి కాల్వలో పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. కొన్ని గంటల వెతుకులాట తర్వాత  తల్లీకొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి.  మృతదేహాలు బయటపడే సమయంలో తల్లి తన కొడుకు చేతిని పట్టుకునే ఉండడం స్థానికులను కలిచివేసింది.

మరోవైపు రక్షణ సిబ్బంది వేగంగా స్పందించి ఉంటే తల్లీ కొడుకులను కాపాడేవారని తనూజ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తనూజ భర్త  గోవింద్ సింగ్ నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో   గోవింద్ సింగ్ డ్యూటీలో ఉన్నారు. 

మరోవైపు ఈ ఘటనపై మృతురాలు మామ హరీష్ రావత్ స్పందించారు. నిన్న సాయంత్రం  డ్రెయిన్ పొంగి ప్రవహిస్తోందని సకాలంలో గుర్తించలేకపోయిందని తెలిపారు. సాయంత్రం 7.30 గంటలకు మాకు ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చిందన్నారు. అనంతరం100కి కాల్ చేసినా పోలీసులు త్వరగా స్పందించలేదన్నారు. పోలీసుల రెస్క్యూ టీమ్‌ చాలా ఆలస్యంగా వచ్చారని.. ఆ సమయంలో పోలీసుల వద్ద పరికరాలు లేవన్నారు. సంఘటన జరిగిన  రెండు గంటల తర్వాత మృతదేహాలను బయటకు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తనూజ, ప్రియాంష్‌లను ఓ ప్రైవేట్ క్యాబ్‌లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని.. ప్రభుత్వం కనీసం  అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదని కన్నీరు పెట్టుకున్నారు.