న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. రోడ్డుపై జరిగిన ఘర్షణలో ఒక మహిళను కాల్చి చంపిన ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన హీరా సింగ్ తన భార్య సిమ్రన్ జీత్ కౌర్(30), ఇద్దరు పిల్లలతో కలిసి ఈశాన్య ఢిల్లీలో ఉన్న మౌజ్పూర్ వైపు బుధవారం రోజు బైక్పై వెళుతున్నాడు. గోకల్పురి ఫ్లై ఓవర్ దగ్గర వీరి బైక్, వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన మరో స్కూటీ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ పరిణామం గొడవకు దారితీసింది. హీరా సింగ్, అతని భార్య సిమ్రన్ జీత్ కౌర్ ఆ స్కూటీపై ఉన్న వ్యక్తితో గొడవ పడ్డారు. ఈ ఘర్షణ ఒకానొక సమయానికి తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు. దుర్భాషలాడుకున్నారు.
ఫ్లై ఓవర్ పై గొడవ జరగడంతో తోటి ప్రయాణికులు ఇరు వర్గాలతో మాట్లాడి అక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఆ స్కూటీపై ఉన్న అతను ఫ్లై ఓవర్ పై నుంచి వెళ్లినట్టే వెళ్లి ఫ్లై ఓవర్ కింద నక్కి ఉన్నాడు. ఆ ఫ్యామిలీ ఫ్లై ఓవర్ దిగుతుండగా హీరా సింగ్ భార్యను ఫ్లై ఓవర్ కింద నుంచి 30- నుంచి 35 అడుగుల దూరంలో ఉండి తుపాకీతో కాల్చాడు. తుపాకీ నుంచి బులెట్ నేరుగా హీరా సింగ్ భార్య సిమ్రన్ జీత్ కౌర్ ఛాతిలోకి దిగింది. మెడకు దగ్గరగా ఛాతిలోకి బులెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. సమీపంలోని జీటీబీ హాస్పిటల్కు హీరా సింగ్ తన భార్యను హుటాహుటిన తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై హీరా సింగ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్ రేజ్ ఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సిమ్రన్ జీత్ కౌర్ హత్య కేసుపై విచారణ జరుపుతున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు.