లక్నోకు ఢిల్లీ దెబ్బ

లక్నోకు ఢిల్లీ దెబ్బ
  •     19 రన్స్‌‌‌‌ తేడాతో క్యాపిటల్స్‌‌‌‌ విజయం
  •     మెరిసిన పోరెల్, స్టబ్స్‌‌‌‌, ఇషాంత్
  •     పూరన్‌‌‌‌, అర్షద్‌‌‌‌ పోరాటం వృథా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌–17లో లీగ్ దశను విజయంతో ముగించిన  ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌.. లక్నో సూపర్‌‌‌‌ జెయింట్స్‌‌‌‌ను దెబ్బకొట్టింది. గెలిస్తే లక్నో ప్లే ఆఫ్‌‌‌‌ అవకాశాలు మెరుగయ్యే చాన్స్‌‌‌‌ ఉన్న మ్యాచ్‌‌‌‌లో 19 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. డీసీ ఐదో ప్లేస్‌‌లో నిలిచి ఇంకా నాకౌట్‌‌‌‌ రేసులో ఉన్నా.. ఇతర మ్యాచ్‌‌‌‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. టాస్‌‌‌‌ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 208/4 స్కోరు చేసింది. అభిషేక్‌‌‌‌ పోరెల్‌‌‌‌ (33 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 58), ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (25 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 57 నాటౌట్‌‌‌‌), షై హోప్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 38) రాణించారు.

తర్వాత లక్నో 20 ఓవర్లలో 189/9కే పరిమితమైంది. నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 61), అర్షద్ ఖాన్‌‌‌‌ (33 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 58 నాటౌట్‌‌‌‌) ఆశలు రేకెత్తించినా గెలిపించలేకపోయారు. ఇషాంత్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

పోరెల్‌‌‌‌, స్టబ్స్‌‌‌‌ ధనాధన్‌‌‌‌

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఢిల్లీని అడ్డుకోవడంలో లక్నో బౌలర్లు ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌‌‌‌ రెండో బాల్‌‌‌‌కు మెక్‌‌‌‌గర్క్‌‌‌‌ (0) వికెట్‌‌‌‌ తీసినా.. మిడిల్‌‌‌‌లో భారీ స్కోరు ఇచ్చుకున్నారు. సిక్స్‌‌‌‌తో ఖాతా ఓపెన్‌‌‌‌ చేసిన పోరెల్‌‌‌‌ థర్డ్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో 4, 4, 6, 4తో 21 రన్స్‌‌‌‌ దంచితే, తర్వాతి ఓవర్లలో హోప్‌‌‌‌ 4, 4, 6, 4 బాదాడు. ఆరో ఓవర్‌‌‌‌లో పోరెల్‌‌‌‌ మరో రెండు సిక్స్‌‌‌‌లు, ఓ ఫోర్‌‌‌‌తో పవర్‌‌‌‌ప్లేలో డీసీ స్కోరును 73/1కి చేర్చాడు.

ఈ క్రమంలో పోరెల్‌‌‌‌ 21 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే 9వ ఓవర్‌‌‌‌లో రవి బిష్ణోయ్‌‌‌‌ (1/26) దెబ్బకు హోప్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడంతో రెండో వికెట్‌‌‌‌కు 92 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. పంత్‌‌‌‌ (33) కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో ఢిల్లీ 106/2 స్కోరు చేసింది. కానీ జోరు మీదున్న పోరెల్‌‌‌‌ను 12వ ఓవర్‌‌‌‌లో నవీన్‌‌‌‌ (2/51) ఔట్‌‌‌‌ చేసి మూడో వికెట్‌‌‌‌కు 17 రన్స్‌‌‌‌ భాగస్వామ్యాన్ని బ్రేక్‌‌‌‌ చేశాడు.

ఈ దశలో వచ్చిన స్టబ్స్‌‌‌‌ రెండు కీలక భాగస్వామ్యాలతో భారీ స్కోరు అందించాడు. వరుస ఫోర్లతో చెలరేగిన పంత్‌‌‌‌ అతనికి అండగా నిలిచినా ఎక్కువసేపు వికెట్‌‌‌‌ కాపాడుకోలేదు. 17వ ఓవర్‌‌‌‌లో నవీన్‌‌‌‌ వేసిన వైడ్‌‌‌‌ లైన్‌‌‌‌ బాల్‌‌‌‌ను టచ్‌‌‌‌ చేసి హుడాకు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌‌‌‌కు 47 రన్స్‌‌‌‌ జతయ్యాయి. చివర్లో అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (14 నాటౌట్‌‌‌‌) మెల్లగా ఆడినా, స్టబ్స్‌‌‌‌ సిక్స్‌‌‌‌లు, ఫోర్లతో హోరెత్తించాడు. నాలుగో వికెట్‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌ జోడించడంతో డీసీ భారీ టార్గెట్‌‌‌‌ను ఉంచింది. 

ఇషాంత్‌‌‌‌ అదుర్స్..

ఛేదనలో లక్నోను పేసర్‌‌‌‌ ఇషాంత్‌‌‌‌ శర్మ (3/34) ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. తన వరుస ఓవర్లలో డికాక్‌‌‌‌ (12), రాహుల్‌‌‌‌ (5), దీపక్‌‌‌‌ హుడా (0)ను ఔట్‌‌‌‌ చేసి షాకిచ్చాడు. మధ్యలో పూరన్‌‌‌‌ వేగంగా ఆడినా.. రెండో ఎండ్‌‌‌‌లో స్టోయినిస్‌‌‌‌ (5)ను అక్షర్‌‌‌‌ (1/20), 8వ ఓవర్‌‌‌‌లో ఆయూష్‌‌‌‌ బదోనీ (6)ని స్టబ్స్‌‌‌‌ (1/4) పెవిలియన్‌‌‌‌కు పంపారు. దీంతో లక్నో 71 రన్స్‌‌‌‌కే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది.

20 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన పూరన్‌‌‌‌ను 12వ ఓవర్‌‌‌‌లో ముకేశ్‌‌‌‌ (1/33) ఔట్‌‌‌‌ చేయడంతో లక్నో మరింత దిగజారింది. కానీ చివర్లో అర్షద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో చెలరేగాడు. క్రునాల్‌‌‌‌ పాండ్యా (18)తో ఏడో వికెట్‌‌‌‌కు 33 రన్స్‌‌‌‌ జత చేసిన అతను యుధ్‌‌వీర్  (14)తో ఎనిమిదో వికెట్‌‌‌‌కు 33 రన్స్‌‌‌‌ జోడించి ఆశలు రేకెత్తించాడు. ఇక చివరి 12 బాల్స్‌‌‌‌లో 29 రన్స్‌‌‌‌ చేయాల్సిన దశలో రవి బిష్ణోయ్‌‌‌‌ (2) రనౌట్‌‌‌‌ కావడం, చివర్లో అర్షద్‌‌‌‌ షాట్లకు ట్రై చేసినా సక్సెస్‌‌‌‌ కాకపోవడంతో లక్నోకు ఓటమి తప్పలేదు. 

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 208/4 (అభిషేక్‌‌‌‌ 58, స్టబ్స్‌‌‌‌ 57*, నవీన్‌‌‌‌ ఉల్‌‌‌‌ హక్‌‌‌‌ 2/51). 
లక్నో: 20 ఓవర్లలో 189/9 (పూరన్‌‌‌‌ 61, అర్షద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ 58*, ఇషాంత్‌‌‌‌ 3/34)