
బెంగళూరు: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ సహా నాలుగు విజయాలతో అందరికంటే ముందుగా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకుంది. షెఫాలీ వర్మ (80 నాటౌట్), జెస్ జొనాసెన్ (61 నాటౌట్) చెలరేగడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో డీసీ 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 147/5 స్కోరు చేసింది. ఎలైస్ పెర్రీ (60 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. డ్యానీ వ్యాట్ (21), రాఘవి బిస్త్ (33) రాణించగా.. కెప్టెన్ స్మృతి మంధాన (8), రిచా ఘోష్ (5), కనిక అహుజా (2) నిరాశపర్చారు.
శిఖా పాండే, శ్రీచరణి చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 15.3 ఓవర్లలో 151/1 స్కోరు చేసి నెగ్గింది. మూడో ఓవర్‌లోనే లానింగ్ (2) ఔట్ కాగా.. షెఫాలీ, జొనాసెన్ మరో వికెట్ పడకుండా విజయానికి అవసరమైన 146 రన్స్ ను 77 బాల్స్‌లోనే అందించారు. రేణుకా సింగ్ ఒక వికెట్ తీసింది. షెఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తాజా విజయంతో డీసీ 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలవగా, బెంగళూరు 4 పాయింట్లతో నాలుగో ప్లేస్‌కు పడింది.