కిచెన్​ తెలంగాణ : ఈ సండే స్పెషల్ బార్లీతో వెరైటీ వంటకాలు

కిచెన్​ తెలంగాణ :  ఈ సండే స్పెషల్ బార్లీతో వెరైటీ వంటకాలు

బార్లీ లేదా యవలు.. ఇవి తృణధాన్యాలు. ఈమధ్యకాలంలో ఓట్స్​లానే, బార్లీ కూడా చాలామంది మెనూల్లో చేరింది. ఇవి డయాబెటిస్, కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు.. వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించి కూల్​ చేయడంలో బార్లీ ది బెస్ట్​! వీటితో ఇలా బ్రేక్​ఫాస్ట్​, శ్నాక్​, డ్రింక్​... వంటివి ఈజీగా చేసుకోవచ్చు. డిఫరెంట్​ టేస్ట్​తోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ బార్లీ రెసిపీలు అస్సలు మిస్​కాకండి.

లడ్డు

కావాల్సినవి :బార్లీ గింజల పొడి– రెండు కప్పులు, బాదం, అవిసె గింజలు – ఒక్కోటి అర కప్పు, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, యాలకులు – ఐదుబెల్లం – ఒకటిన్నర కప్పు

తయారీ :పాన్​లో రెండు టేబుల్​ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో బార్లీ గింజల పొడి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పాన్​లో బాదం, అవిసె గింజల్ని నూనె లేకుండా వేగించి పక్కన పెట్టాలి. అవి చల్లారాక మిక్సీజార్​లో వేసి, వాటితోపాటు యాలకులు కూడా వేసి గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీయాలి. ఆ తర్వాత మిక్సీజార్​లో బెల్లం వేసి గ్రైండ్ చేయాలి. ఆ బెల్లాన్ని కూడా బార్లీ పొడి మిశ్రమంలో వేసి కలపాలి. చివరిగా ఒక టేబుల్ స్పూన్​ నెయ్యి వేడి చేసి అందులో వేసి బాగా కలపాలి. కాస్త వేడిగా ఉండగానే ఆ పిండి మిశ్రమాన్ని లడ్డూలుగా చేయాలి. 

జావ

కావాల్సినవి :

బార్లీ గింజల పొడి – పావు కప్పు

సబ్జా గింజలు – ఒక టీస్పూన్

నీళ్లు – ఐదు కప్పులు

అల్లం – చిన్న ముక్క

ఉప్పు – సరిపడా

నిమ్మరసం – ఒక టీస్పూన్

పెరుగు – అర కప్పు

తయారీ :

సబ్జా గింజల్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. పాన్​లో బార్లీ వేసి నూనె లేకుండా వేగించాలి. చల్లారాక వాటిని మిక్సీపట్టాలి. ఆ పిండిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పాన్​లో నీళ్లు పోసి ఉప్పు. అల్లం ముక్క వేసి వేడిచేయాలి. నీళ్లు మరిగాక బార్లీ పొడి కలిపిన నీళ్లు కూడా పోయాలి. మరికాసేపు ఆ నీటిని మరిగించిన తర్వాత వడకట్టాలి. పెరుగుని మజ్జిగలా చేసి ఆ మిశ్రమంలో పోసి కలపాలి. చివరిగా నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మరసం, పుదీనా వేయాలి. 

నాస్తా

కావాల్సినవి :

బార్లీ గింజలు, పెరుగు – ఒక్కో కప్పు

నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – సరిపడా

అల్లం – చిన్న ముక్క, పచ్చిమిర్చి – రెండు

క్యారెట్ తురుము – పావు కప్పు

కొత్తిమీర – కొంచెం, ఆవాలు, జీలకర్ర – ఒక్కోటి అరటీస్పూన్,  ఇంగువ – చిటికెడు

నూనె – ఒక టీస్పూన్

తయారీ :

బార్లీ గింజల్ని శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి, ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి. ఉడికిన బార్లీని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.  ఆ తర్వాత మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని, అందులో పెరుగు వేయాలి. కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. కొత్తిమీర తరుగు, క్యారెట్​ తురుము కూడా వేసి మరోసారి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. ఆ పోపును బార్లీ మిశ్రమంలో వేసి కలిపితే సరి.