
సంక్రాంతి... ప్రతి ఏటా వచ్చేదే. మరి స్పెషల్ ఏంటి? అంటే ఎప్పుడూ వండేవే అంటారా.. అయితే, ఈసారి కాస్త కొత్తగా చేసుకోవాలంటే ఈ రెసిపీలు ట్రై చేయాల్సిందే. కొత్త ఏడాది కొత్త రుచులతో ఆరోగ్యాన్నిచ్చే పసందైన వంటకాలు ఇవి. చిరుధాన్యాలతో సరికొత్త సంక్రాంతికి సిద్ధమైపోండి.
మిల్లెట్గరిజెలు
కావాల్సినవి :
సజ్జపిండి – కప్పు
జొన్నపిండి – కప్పు
గోధుమ పిండి – ఒక్కో టేబుల్ స్పూన్
మైదా పిండి – రెండు టేబుల్ స్పూన్లు
నూనె, కొబ్బరి పొడి, చక్కెర, ఉప్పు – సరిపడా
యాలకులు – రెండు
కొర్రలు, అరికెలు – ఒక్కోటి మూడు టేబుల్ స్పూన్లు
నువ్వులు – మూడు టీస్పూన్లు
తయారీ : పాన్‌లో కొర్రలు, అరికెలు, నువ్వులు, యాలకులు వేసి నూనె లేకుండా వేగించాలి. కాసేపయ్యాక వాటిని మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో చక్కెర, కొబ్బరి పొడి వేసి కలపాలి. ఒక గిన్నెలో సజ్జపిండి, జొన్న పిండి, గోధుమ పిండి, మైదా, ఉప్పు వేసి నీళ్లు పోసి ముద్దగా కలిపి పక్కన పెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి వాటిని చపాతీల్లా చేయాలి. దాని మధ్యలో రెడీ చేసుకున్న మిల్లెట్ మిశ్రమం పెట్టి గరిజెల్లా వత్తాలి. పాన్‌లో నూనె వేడి చేసి అందులో రెడీ చేసుకున్న గరిజెలు వేసి వేగిస్తే సరి. ఈ గరిజెలు రుచితోపాటు ఆరోగ్యాన్నిస్తాయి.
అరికెల పొంగల్
కావాల్సినవి :
అరికెలు – అర కప్పు
పెసరపప్పు – అర కప్పు
బెల్లం – ఒక కప్పు
నీళ్లు – నాలుగు కప్పులు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – అర టీస్పూన్
జీడిపప్పులు – పది
ఎండు ద్రాక్ష – రెండు టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు
తయారీ : అరికెల్ని నాలుగైదుసార్లు కడిగి, నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వడకట్టాలి. పాన్‌లో పెసరపప్పు వేసి నూనె లేకుండా వేగించి, ఆపై వాటిని కడగాలి. ఈ రెండింటినీ ప్రెజర్ కుక్కర్లో వేయాలి. రెండు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. మరో పాత్రలో బెల్లం వేసి ఒక కప్పు నీళ్లు పోసి కరిగే వరకు మరిగించాలి. ఆపై ఆ బెల్లం నీటిని వడకట్టాలి. మరో పాన్‌లో ఉడికించిన అరికెల మిశ్రమం వేసి అందులో బెల్లం నీళ్లు పోయాలి. వాటితోపాటు ఒక కప్పు నీళ్లు పోసి, ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు కలుపుతూ ఉడికించాలి. చివరిగా యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ఆ తర్వాత నేతిలో వేగించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఎండు కొబ్బరి ముక్కలు వేయాలి. అంతే..
ఈ పొంగల్‌కి స్వీట్ పొంగల్ రెడీ.
జొన్న జంతికలు
కావాల్సినవి :
పచ్చిమిర్చి – ఐదు
వెల్లుల్లి రెబ్బలు – పది
జీలకర్ర – అర టీస్పూన్
ఉప్పు, నూనె – సరిపడా
జొన్న పిండి – నాలుగు కప్పులు
బియ్యప్పిండి – ఒక కప్పు
నువ్వులు – రెండు టేబుల్ స్పూన్లు
కారం – ఒక టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
వేడి నీళ్లు – రెండున్నర కప్పులు
తయారీ : మిక్సీజార్‌లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. అందులోనే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేసి కలపాలి. పాన్‌లో ఒక కప్పు నూనె వేడి చేసి జొన్న పిండి మిశ్రమంలో వేసి మరోసారి జాగ్రత్తగా ఉండలు లేకుండా కలపాలి. తర్వాత వేడి నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ముద్దలా చేశాక తడి క్లాత్ కప్పి కాసేపు పక్కన ఉంచాలి. ఆపై ఆ పిండిని జంతికల గొట్టంలో పెట్టి, వేడి నూనెలో గొట్టాన్ని గుండ్రంగా తిప్పుతూ జంతికలు వేయాలి. అవి బాగా వేగాక బయటకు తీయాలి. చల్లారాక తింటే కరకరలాడుతూ భలే ఉంటాయి.