
దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్ఎన్నికల నాటికి లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయా లన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్స్టేట్స్లో ఆందోళన నెలకొన్నది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా..అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు.
25 ఏండ్లకు పోస్ట్‌పోన్..
దేశంలో జనాభా పెరిగిపోతుండడంతో జనాభా నియంత్రణపై నాటి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 1976 ఎమర్జెన్సీ టైమ్నాటికి అది పీక్స్‌కు చేరింది. దీంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగానికి 42వ సవరణ చేసి డీలిమిటేషన్‌ను 25 ఏండ్లపాటు వాయిదా వేశారు. తద్వారా రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సారిస్తాయని ఆమె భావించారు.
డీలిమిటేషన్ చేస్తే.. ఎక్కువ సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో జనాభా నియంత్రణను రాష్ట్రాలు పట్టించుకోవన్న ముందుచూపుతోనే డీలిమిటేషన్‌ను ఆపేశారు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వాలని భావించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను తమ భుజస్కందాలపై వేసుకున్నాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది.
అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణను గాలికొదిలేశాయి. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది. ఫలితంగా ఉత్తరాదిలో జనాభా పెరిగి.. పశ్చిమ, దక్షిణాదిలో తగ్గినట్టయింది. ఈ క్రమంలో 2001లో జనాభా లెక్కలు చేసినా అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి 84వ సవరణ చేసి డీలిమిటేషన్‌ను మరో 25 ఏండ్ల పాటు వాయిదా వేసింది.
అంటే 2026 వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచరాదని నిర్ణయించింది. 2001లో సీట్ల సంఖ్యను పెంచకపోయినా నియోజకవర్గాల హద్దులను మాత్రం మార్చారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని నాడు దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. కేవలం హద్దుల మార్పు వరకే నాటి కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. ప్రస్తుతం దానికి మరో ఏడాది గడువు మాత్రమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిపై స్పీడ్‌పెంచింది.