డీలిమిటేషన్ హీట్ : ఈ లెక్కన అయితే దేశంలో 1400 లోక్ సభ సీట్లు

డీలిమిటేషన్ హీట్ : ఈ లెక్కన అయితే దేశంలో 1400 లోక్ సభ సీట్లు


పార్లమెంట్ సీట్లు పెంపు టాపిక్ ఇపుడు దేశ వ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది.  జనాభా ప్రాతిపాదికన సీట్ల పెంపు జరిగితే దక్షాణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎంలు వాదిస్తున్నారు. జనాభా ప్రకారం డీలిమిటేష్ జరిగితే దేశ వ్యప్తంగా ఇపుడు ఎన్ని సీట్లు పెరుగతాయో ఒకసారి చూద్దాం.

గతంలో జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి లోక్‌‌‌‌సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తూ వచ్చారు. రాజ్యాంగంలోని 82, 170 అధికరణాల ప్రకారం నియోజకవర్గాల హద్దులను నిర్ణయించి సీట్ల సంఖ్యలో మార్పులు చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో మూడుసార్లు డీలిమిటేషన్​చేయగా, రెండుసార్లే సీట్ల సంఖ్యను పెంచారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న నాటి కేంద్ర ప్రభుత్వాలు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం హద్దులను మాత్రమే మార్చాయి. 

1951 జనాభా లెక్కల ప్రకారం 36.1 కోట్ల జనాభా ఉండేది. అప్పుడు ప్రతి 7.3 లక్షల జనాభాకు ఒక లోక్‌‌‌‌సభ స్థానం చొప్పున 494 సీట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత 1961 జనాభా లెక్కల్లో జనాభా 43.9 కోట్లకు పెరిగింది. అప్పుడు 8.4 లక్షలకో సీటు చొప్పున లోక్‌‌‌‌సభ స్థానాలను 522కి పెంచారు. మూడోసారి 1971 జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్ల జనాభా లెక్క తేలింది. 10.1 లక్షల జనాభాకు సీటు చొప్పున 543 స్థానాలను నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 54 ఏండ్లలో ఒక్కసారి కూడా మళ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు. 

ఒక వేళ 2026లో జనాభా లెక్కన పార్లమెంట్ సీట్ల పెంపు జరిగితే..  భారత జనాభా ప్రస్తుతం దాదాపు 140 కోట్లకు పై చిలుకు ఉంది. 10లక్షలకు ఒక ఎంపీ సీటు చొప్పున అంటే ఒక కోటి జనాభాకు 10 ఎంపీ సీట్లు ఈ ప్రాతిపాదికన 140 కోట్ల జనాభాకు 1400 ఎంపీ సీట్లు ఉండాలి.  అంటే  పార్లమెంట్ సీట్ల స్థానాలు 543 నుంచి ఏకంగా 1400కు పెరుగుతాయన్న మాట.