
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్చేస్తే తెలంగాణ, ఏపీలో మూడు చొప్పున సీట్లే పెరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లుండగా 20కి, ఏపీలో 25 ఉండగా 28కి పెరుగుతాయి. కేరళ పరిస్థితి అయితే దారుణమనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 సీట్లుండగా ఒక స్థానానికి కోత పడి 19కి తగ్గుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా రెండు పెరిగి 41కి చేరుకుంటాయి.
కర్నాటకలో 28 స్థానాలుండగా, 36కి పెరుగుతాయి. దక్షిణాదిలో అంతో ఇంతో లాభపడేదంటే కర్ణాటకేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్వంటివి భారీగా లాభపడనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా, అవి 128కి చేరుకుంటాయి. బిహార్‌లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్‌లో 25 నుంచి 44కి లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
జనాభా నియంత్రణే దక్షిణాదికి శాపమా..
జనాభా నియంత్రణను ఓ యజ్ఞంలా చేయడమే తమకు శాపమా అంటూ దక్షిణాది రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. జనాభాను కంట్రోల్చేయడమే ఆయా రాష్ట్రాలకు ప్రతికూలంగా మారిందని ఆర్ఎస్ఎస్కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. జనాభా నియంత్రణలో సక్సెస్ అయినందుకు సీట్లు నష్టపోతామన్న పశ్చిమ, దక్షిణాది ఆందోళనను సంఘ్ మేగజైన్ ఆర్గనైజర్ కూడా ప్రస్తావించింది. ఇప్పుడు ఆ జనాభానే ఆయుధంగా మలుచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు డీలిమిటేషన్ చేపట్టాలని ఎత్తులు వేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఎక్కువ జనాభా సాకును చూపి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. డీలిమిటేషన్చేసి సీట్ల సంఖ్యను పెంచితే నిధుల మళ్లింపులో కేంద్రానికి అడ్డూఅదుపూ అన్నదే లేకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నియోజకవర్గాల ఆధారంగా ఇచ్చే ఎంపీలాడ్స్నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉత్తరాదివైపునకే వెళ్తాయని, సొమ్ములు దక్షిణాదివి సోకులు ఉత్తరాదివి అన్న చందంగా పరిస్థితి మారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనాభా ఎంతుండాలి...
గతంలో మూడుసార్లు డీలిమిటేషన్చేసినప్పుడల్లా.. ఒక్కో నియోజకవర్గంలోనూ జనాభా ప్రాతినిధ్యాన్ని పెంచుతూ వచ్చారు. చివరిసారిగా 1971లో చేసినప్పుడు 10.11 లక్షల జనాభాకు ఓ సీటుగా నిర్ధారించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 54 ఏండ్లలో జనాభా 140 కోట్లకుపైగా చేరింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్కమిషన్ను ఏర్పాటు చేస్తే.. ఆ కమిషన్ఒక్కో సీటుకు ఎంత జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది.
చివరిసారిగా చేసినట్టు 10.11 లక్షల జనాభాకు ఓ సీటు ఉండేలా నిర్ణయిస్తే.. మొత్తం సీట్ల సంఖ్య 1,400దాకా చేరే అవకాశం ఉంది. అదే జరిగితే యూపీ, ఉత్తరాఖండ్‌లో కలిపి సీట్ల సంఖ్య 250కి పెరుగుతుందనే చర్చ నడుస్తున్నది. అదే బిహార్, జార్ఖండ్‌లలో 82కి పెరుగుతాయి. ఇదే లెక్కన తమిళనాడు సీట్లు 76కి, కేరళ సీట్లు 36కి , తెలంగాణలో ఇప్పుడున్న సీట్లకు అదనంగా మరో 20 కలిసి 37కి చేరుతాయి.
కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో 10.11 లక్షల జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బదులు ప్రతి 20 లక్షల జనాభాకో సీటు చొప్పున డీలిమిటేషన్చేస్తే.. దేశవ్యాప్తంగా సీట్లు 710 వరకు చేరుతాయి. ఇలా ఎంత జనాభాను ప్రాతిపదికన తీసుకున్నా ఉత్తరాదిన జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ, దక్షిణాదిన తక్కువ రేషియోలో సీట్లు పెరుగుతాయి.
దీనికి బదులు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్ల సంఖ్యను ప్రాతిపదికన చేసుకొని 50 శాతం పెంచాలని, తద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని దక్షిణాది సీఎంలు కేంద్రాన్ని కోరుతున్నారు.