
చెన్నై: పార్లమెంటులో లోక్‌సభ సీట్ల డీలిమిటేషన్ ఇష్యూను లేవనెత్తాలని డీఎంకే ఎంపీలకు ఆ పార్టీ చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సూచించారు. దీంతో పాటు తమిళనాడు హక్కుల కోసం పోరాడాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆదివారం చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే.. దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో సహా ఇతర రాష్ట్రాలూ ప్రభావితమవుతాయని పేర్కొన్నారు.
డీలిమిటేషన్, హిందీ ఇంపోజిషన్ అంశాలు చర్చకు వస్తే వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలని పార్టీ ఎంపీలకు స్టాలిన్ సూచించారు. ఒకవేళ డీలిమిటేషన్ చేయాల్సి వస్తే 1971 జనాభా లెక్కల ఆధారంగానే చేయాలని స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే, ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని, గందరగోళ పరిస్థితులు సృష్టిస్తోందని డీఎంకే ఎంపీలు ఆరోపిస్తున్నారు.
దీనిపై సీఎం స్టాలిన్ చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని, పార్లమెంటులో చర్చించి తమిళనాడు ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా కోల్పోకుండా చూసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌కు చెందిన రాజకీయ పార్టీల మద్దతును సేకరించడానికి ప్రయత్నాలు చేయాలని, ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటంలో వారిని భాగం చేయాలని డీఎంకే ఎంపీలు నిర్ణయించారు. ఇందుకోసం కూటమి పార్టీలకు చెందిన నాయకులతో సమన్వయం చేసుకోనున్నారు.