దక్షిణాదిన లిమిటేషన్​ హీట్

దక్షిణాదిన లిమిటేషన్​ హీట్
  • జనాభా ప్రాతిపదికన లోక్‌‌‌‌సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక 
  • తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళ ననార్త్ స్టేట్స్‌‌‌‌కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్ 
  • జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్‌‌‌‌కు ఇప్పుడు నష్టం   
  • లోక్‌‌‌‌సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19 శాతానికి పడిపోయే చాన్స్ 
  • తెలంగాణ, ఏపీలో 3 సీట్ల చొప్పున పెరిగే అవకాశం  
  • కేరళలోనైతే ఇప్పుడున్న సీట్లలో ఒక్కటి తగ్గిపోవచ్చు
  • యూపీ, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు 
  • ఇప్పటి వరకు మూడుసార్లు డీలిమిటేషన్.. రెండుసార్లు సీట్లు పెంపు 
  • ఇప్పుడు 2026లో డీలిమిటేషన్​చేసేందుకు కేంద్రం కసరత్తు 

హైదరాబాద్​, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్​సెగ రాజుకుంటున్నది. వచ్చే పార్లమెంట్​ఎన్నికల నాటికి లోక్‌‌‌‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయా లన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్​స్టేట్స్​లో ​ఆందోళన నెలకొన్నది. జనాభా ప్రాతిపదికన లోక్‌‌‌‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా..అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. 

‘జనాభా తగ్గించడమే మేము చేసిన పాపమా?’ అని పలు వేదికలపై ప్రశ్నిస్తున్నారు. ‘మోదీ వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. డీ లిమిటేషన్ ఎజెండా’ ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్​అంటే.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కని జనాభా పెంచాలని ఏపీ, తమిళనాడు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్​ పిలుపునిచ్చారు.  ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్​షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

‘డీలిమిటేషన్‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా తగ్గదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ‘దక్షిణాదిన సీట్లు తగ్గవు అంటే పెరగవనే కదా?’ అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాదిన సీట్లు పెరిగి, దక్షిణాదిలో తగ్గితే పార్లమెంట్‌‌‌‌తో పాటు  కేంద్ర ప్రభుత్వంలో సౌత్​ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

నాడు కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను అమలు చేసి జనాభా నియంత్రణలో ముందు వరుసలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు తీవ్రమైన నష్టం తప్పదన్న భయాలు వెంటాడుతున్నాయి. ఉత్తరాదిలో బాగా పట్టున్న బీజేపీ.. అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే ఈ తరహా వ్యూహంతో ముందుకెళ్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం లోక్‌‌‌‌సభలో ఉన్న 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలవి కేవలం 129 సీట్లే. 

అంటే మొత్తం స్థానాల్లో  సౌత్​ వాటా కేవలం 24 శాతమే! 19 లక్షల జనాభాకు ఒక సీటు చొప్పున డీలిమిటేషన్​జరిగితే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్​సభ స్థానాలు 753కి పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144కి చేరుతాయి. మొత్తంగా సౌత్​వాటా 19 శాతానికి పడిపోతుంది. 

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను ఇదే అంశం తీవ్రంగా కలవరపెడుతోంది. డీలిమిటేషన్​జరిగితే సభలో ఉత్తరాది గుత్తాధిపత్యానికి తెరదీసినట్టవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

తెలంగాణలో 3 సీట్లే పెరుగుతయ్​.. 

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​చేస్తే తెలంగాణ, ఏపీలో మూడు చొప్పున సీట్లే పెరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌‌‌‌సభ సీట్లుండగా 20కి, ఏపీలో 25 ఉండగా  28కి పెరుగుతాయి. కేరళ పరిస్థితి అయితే దారుణమనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 సీట్లుండగా ఒక స్థానానికి కోత పడి 19కి తగ్గుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా రెండు పెరిగి 41కి చేరుకుంటాయి.

కర్నాటకలో 28 స్థానాలుండగా, 36కి పెరుగుతాయి. దక్షిణాదిలో అంతో ఇంతో లాభపడేదంటే కర్ణాటకేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్​వంటివి భారీగా లాభపడనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్‌‌‌‌సభ స్థానాలు ఉండగా, అవి 128కి చేరుకుంటాయి.  బిహార్‌‌‌‌‌‌‌‌లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్​లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్‌‌‌‌లో 25 నుంచి 44కి లోక్‌‌‌‌సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఇప్పటికి రెండుసార్లు పెరిగినయ్​..

గతంలో జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి లోక్‌‌‌‌సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తూ వచ్చారు. రాజ్యాంగంలోని 82, 170 అధికరణాల ప్రకారం నియోజకవర్గాల హద్దులను నిర్ణయించి సీట్ల సంఖ్యలో మార్పులు చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో మూడుసార్లు డీలిమిటేషన్​చేయగా, రెండుసార్లే సీట్ల సంఖ్యను పెంచారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న నాటి కేంద్ర ప్రభుత్వాలు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం హద్దులను మాత్రమే మార్చాయి. 

1951 జనాభా లెక్కల ప్రకారం 36.1 కోట్ల జనాభా ఉండేది. అప్పుడు ప్రతి 7.3 లక్షల జనాభాకు ఒక లోక్‌‌‌‌సభ స్థానం చొప్పున 494 సీట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత 1961 జనాభా లెక్కల్లో జనాభా 43.9 కోట్లకు పెరిగింది. అప్పుడు 8.4 లక్షలకో సీటు చొప్పున లోక్‌‌‌‌సభ స్థానాలను 522కి పెంచారు. మూడోసారి 1971 జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్ల జనాభా లెక్క తేలింది. 10.1 లక్షల జనాభాకు సీటు చొప్పున 543 స్థానాలను నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 54 ఏండ్లలో ఒక్కసారి కూడా మళ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు. 

25 ఏండ్లకు పోస్ట్‌‌‌‌పోన్..

దేశంలో జనాభా పెరిగిపోతుండడంతో జనాభా నియంత్రణపై నాటి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 1976 ఎమర్జెన్సీ టైమ్​నాటికి అది పీక్స్‌‌‌‌కు చేరింది. దీంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగానికి 42వ సవరణ చేసి డీలిమిటేషన్‌‌‌‌ను 25 ఏండ్లపాటు వాయిదా వేశారు. తద్వారా రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సారిస్తాయని ఆమె భావించారు. 

డీలిమిటేషన్ చేస్తే.. ఎక్కువ సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో జనాభా నియంత్రణను రాష్ట్రాలు పట్టించుకోవన్న ముందుచూపుతోనే డీలిమిటేషన్‌‌‌‌ను ఆపేశారు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వాలని భావించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను తమ భుజస్కందాలపై వేసుకున్నాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. 

అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణను గాలికొదిలేశాయి. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది. ఫలితంగా ఉత్తరాదిలో జనాభా పెరిగి.. పశ్చిమ, దక్షిణాదిలో తగ్గినట్టయింది. ఈ క్రమంలో 2001లో జనాభా లెక్కలు చేసినా అప్పటి ప్రధాని వాజ్‌‌‌‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి 84వ సవరణ చేసి డీలిమిటేషన్‌‌‌‌ను మరో 25 ఏండ్ల పాటు వాయిదా వేసింది. 

అంటే 2026 వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచరాదని నిర్ణయించింది. 2001లో సీట్ల సంఖ్యను పెంచకపోయినా నియోజకవర్గాల హద్దులను మాత్రం మార్చారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్​చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని నాడు దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. కేవలం హద్దుల మార్పు వరకే నాటి కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. ప్రస్తుతం దానికి మరో ఏడాది గడువు మాత్రమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిపై స్పీడ్​పెంచింది. 

జనాభా నియంత్రణే దక్షిణాదికి శాపమా..

జనాభా నియంత్రణను ఓ యజ్ఞంలా చేయడమే తమకు శాపమా అంటూ దక్షిణాది రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. జనాభాను కంట్రోల్​చేయడమే ఆయా రాష్ట్రాలకు ప్రతికూలంగా మారిందని ఆర్ఎస్ఎస్​కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. జనాభా నియంత్రణలో సక్సెస్ అయినందుకు సీట్లు నష్టపోతామన్న పశ్చిమ, దక్షిణాది ఆందోళనను సంఘ్ మేగజైన్ ఆర్గనైజర్ కూడా ప్రస్తావించింది. 

ఇప్పుడు ఆ జనాభానే ఆయుధంగా మలుచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు డీలిమిటేషన్​ చేపట్టాలని ఎత్తులు వేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఎక్కువ జనాభా సాకును చూపి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. డీలిమిటేషన్​చేసి సీట్ల సంఖ్యను పెంచితే నిధుల మళ్లింపులో కేంద్రానికి అడ్డూఅదుపూ అన్నదే లేకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

నియోజకవర్గాల ఆధారంగా ఇచ్చే ఎంపీలాడ్స్​నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉత్తరాదివైపునకే వెళ్తాయని, సొమ్ములు దక్షిణాదివి సోకులు ఉత్తరాదివి అన్న చందంగా పరిస్థితి మారుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మహిళలకు ప్రాతినిధ్యం? 

డీలిమిటేషన్‌‌‌‌తో మహిళా స్థానాల సంఖ్య మాత్రం పెరుగుతుందన్న ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం లోక్‌‌‌‌సభలో మహిళల కోటా 82గానే ఉండగా.. డీలిమిటేషన్​ జరిగితే ఆ సంఖ్య 182కు పెరుగుతుందని చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్​బిల్లును పాస్​చేస్తే.. 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే డీలిమిటేషన్​జరిగితే మహిళలకు లాభమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇద్దరు పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ 

ఒకప్పుడు జనాభా ఒక భారం. ఇప్పుడు అది ఒక ఆస్తి. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహకాలు  ఇచ్చేవాళ్లం. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తీసుకువచ్చాం. ఇకపై దానిని మార్చబోతున్నాం. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధన పెట్టబోతున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

పోరాడాల్సిందే..

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్‌‌‌‌కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటం. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడుదాం. తమిళనాడు సీఎం స్టాలిన్

ఉన్న సీట్లను కూడా కోల్పోతాం

వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. డీ లిమిటేషన్.. ఇదే ప్రధాని మోదీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అద‌‌నంగా నియోజ‌‌క‌‌వ‌‌ర్గాలు రాక‌‌పోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతాం.
- తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి

సీట్లు తగ్గవంటే.. పెరగవనే కదా

డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. 
- కర్నాటక సీఎం సిద్ధరామయ్య

అసెంబ్లీ సీట్ల సంగతేంది?

కేంద్రం డీలిమిటేషన్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్తే మన రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 119 స్థానాలుండగా 153 సీట్లకు పెరుగుతాయన్న చర్చ నడుస్తోంది. అంటే 34 సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. 

అందులో ఒక్క హైదరాబాద్​ పరిధిలోనే 11 సీట్లు పెరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 30 శాతానికిపైగా జనాభా హైదరాబాద్​చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి సీట్లు 24 నుంచి 35 వరకు పెరగనుండగా, మిగతా రాష్ట్రమంతటా కేవలం 23 సీట్లే పెరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జనాభా ఎంతుండాలి...

గతంలో మూడుసార్లు డీలిమిటేషన్​చేసినప్పుడల్లా.. ఒక్కో నియోజకవర్గంలోనూ జనాభా ప్రాతినిధ్యాన్ని పెంచుతూ వచ్చారు. చివరిసారిగా 1971లో చేసినప్పుడు 10.11 లక్షల జనాభాకు ఓ సీటుగా నిర్ధారించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 54 ఏండ్లలో జనాభా 140 కోట్లకుపైగా చేరింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్​కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేస్తే.. ఆ కమిషన్​ఒక్కో సీటుకు ఎంత జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది. 

చివరిసారిగా చేసినట్టు 10.11 లక్షల జనాభాకు ఓ సీటు ఉండేలా నిర్ణయిస్తే.. మొత్తం సీట్ల సంఖ్య 1,400దాకా చేరే అవకాశం ఉంది. అదే జరిగితే యూపీ, ఉత్తరాఖండ్‌‌‌‌లో కలిపి సీట్ల సంఖ్య 250కి పెరుగుతుందనే చర్చ నడుస్తున్నది. అదే బిహార్, జార్ఖండ్‌‌‌‌లలో 82కి పెరుగుతాయి. ఇదే లెక్కన తమిళనాడు సీట్లు 76కి, కేరళ సీట్లు 36కి , తెలంగాణలో ఇప్పుడున్న సీట్లకు అదనంగా మరో 20 కలిసి 37కి చేరుతాయి. 

కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో 10.11 లక్షల జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి బదులు ప్రతి 20 లక్షల జనాభాకో సీటు చొప్పున డీలిమిటేషన్​చేస్తే.. దేశవ్యాప్తంగా సీట్లు 710 వరకు చేరుతాయి. ఇలా ఎంత జనాభాను ప్రాతిపదికన తీసుకున్నా ఉత్తరాదిన జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ, దక్షిణాదిన తక్కువ రేషియోలో సీట్లు పెరుగుతాయి. 

దీనికి బదులు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న  సీట్ల సంఖ్యను ప్రాతిపదికన చేసుకొని 50 శాతం పెంచాలని, తద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని దక్షిణాది సీఎంలు కేంద్రాన్ని కోరుతున్నారు.